చంద్రబాబు గత నలభై ఏళ్లుగా ఉమ్మడి రాష్ట్రాల రాజకీయాల్లో తిరుగులేని శక్తి. ప్రతి ఎన్నికకూ ఆయన ప్రత్యర్థి మారుతూంటారు, అలాంటి నేత తన కెరీర్ హై చూపించాలంటే…. ఇప్పటి వరకూ సాధించిన దాని కంటే ఎంతో సాధించాలి. అది అంత తేలిక కాదు. కానీ జగన్ రెడ్డి అది చేసి చూపించారు. చంద్రబాబు రేంజ్ ఏంటో ప్రజల ముందు ఉంచారు.
చంద్రబాబును అరెస్టు చేసినప్పటి నుండి ప్రపంచంలో తెలుగు వారు ఉన్న ప్రతి దేశంలోనూ ఆయనకు మద్దతుగా ప్రదర్శనలు జరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నైల్లోనూ ప్రదర్శనలు జరిగాయి. యాభై రెండు రోజుల పాటు వీటిని కొనసాగిస్తూనే ఉన్నారు. చివరికి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయడం లేదని ప్రకటించిన తర్వాత కూడా గచ్చిబౌలి స్టేడియంలో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నిర్వహించారు. స్టేడియం హౌస్ ఫుల్ అయిపోయింది. ఇలా ఏ కార్యక్రమం నిర్వహించినా చంద్రబాబుకు మద్దతుగా.. సంఘిభావం భారీగా ఉండేలా చూసుకున్నారు. రోజులు గడుస్తున్నా.. ఆ ప్రదర్శనలు కొనసాగాయి.
చంద్రబాబు బయట ఉంటే.. సైబరాబాద్ ను నిర్మించానని పదే పదే చెప్పుకోవాల్సి వచ్చేది. కానీ ఆయన జైల్లో ఉండటం వల్ల .. ఇలాంటి ప్రచారం ఐటీ ఉద్యోగులు చేశారు. చంద్రబాబు చేసిన మంచి పనులన్నీ ప్రజలకు తెలిసేలా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి అంశం .. చంద్రబాబు దూర దృష్టి వల్లనే తెలుగు రాష్ట్రాల్లో సంపద సృష్టి జరిగిందని.. కొత్త తరానికి కూడా తెలిసేలా చేయగలిగారన్న అభిప్రాయం వినిపిస్తోంది. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు సీఎంగా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో ఆయన అధికారంలో లేక ఇరవై ఏళ్లు అయినా చంద్రబాబు ముద్ర కనిపించేలా చేసుకోగలిగారు. ఇదే విషయాన్ని బలంగా యువ ఓటర్ల దృష్టిలోకి తీసుకెళ్లగలిగారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో టీడీపీ నేతలు ఓ రేంజ్ లో ట్రెండింగ్ చేశారు. ఉండవల్లి నివాసానికి వెళ్లే ప్రతీ చోటా.. ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడి స్వాగతం పలికారు. దీంతో చంద్రబాబు కాన్వాయ్ చాలా నెమ్మదిగా సాగింది. పధ్నాలుగు గంటల తరవాత కానీ ఉండవల్లి చేరుకోలేకపోయారు. ప్రజా స్పందన చూసి టీడీపీ నేతలు సంతోషపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ వల్ల టీడీపీకి మేలే జరిగిందని.. చంద్రబాబు రేంజ్ ఏ స్థాయిలో ఉందని జగన్ రెడ్డి చూపించాడన్న సెటైర్లు టీడీపీలో వినిపిస్తున్నాయి.