కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరబోతోందని తెలిసిన తర్వాత వైసీపీలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. ప్రో వైసీపీ మీడియాతో పాటు… ట్విట్టర్ లో పొలిటికల్ ఇన్ ఫ్లూయన్సర్లుగా ఉన్న ఇతర రాష్ట్రాల వారితో ఒకే నెరేటివ్ తో పోస్టులు పెట్టిస్తున్నారు. అదేమిటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ పార్టీ చీలుస్తుందని చెబుతున్నారు. అందువల్ల జగన్ కే మేలు జరుగుతుందని చెప్పడానికి తాపత్రయ పడుతున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంటే… ప్రత్యామ్నాయం ఎవరికి ఉంటే వారికి ఏకపక్షంగా ఓటేస్తారు. అదే సమయంలో జగన్ రెడ్డి కాకపోతే షర్మిల అని అనుకుని ఓటేసేవారు ఎవరు ఉంటారు ?. వైసీపీ ఓటర్లు మాత్రమే ఉంటారు. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉండి.. మంచి చేయలేదని.. మోసం చేశారని భావించే వైసీపీ ఓటర్లు జగన్ రెడ్డికి వేయడానికి మనసొప్పని ఓటర్లు షర్మిల ఉందని కాంగ్రెస్ కు ఓటేస్తారు. దాని వల్ల ఎవరికి నష్టం. చీలిపోయే ఓట్లు ఎవరివి ?.
ఏపీలో తటస్తులు మాత్రమే… ప్రస్తుతం అభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నారు. వారికి ఎవరికి ఓటేస్తే మేలు జరుగుతుందో ఊహించుకునే శక్తి ఉంది. కుల అనుకూలత.. కుల వ్యతిరేకతతో ఓటు వేయాలనుకునే వారు.. ఓటు బ్యాంకులుగానే ఉంటారు. ఆ ఓటు బ్యాంకుల్లో షర్మిల వల్ల చీలిక వచ్చేది
జగన్ రెడ్డికే. అంటే సంప్రదాయ ఓటు బ్యాంక్‌కు కూడా నష్టం జరుగుంది.
ఇవన్నీ రాజకీయంపై కనీస పరిజ్ఞానం ఉన్న వారికీ తెలుసు. కానీ షర్మిల వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని ప్రచారం చేయడం ద్వారా తమను తాము సంతృప్తి పరుచుకుంటున్నారు. అలా అయితే.. షర్మిలను మొదట ఏపీలోనే పార్టీ పెట్టుకోమని చెప్పవచ్చుగా.. తెలంగాణకు ఎందుకు పంపేశారు !?. రాజకీయాల్లో తెలివితేటలు చూపించవచ్చు కానీ అతి తెలివి తేటలు చూపిస్తే మొదటికే మోసం వస్తుంది. వైసీపీ ఇప్పుడు అతి తెలివితేటలతో ఆయాసపడుతోంది.