జగన్ అసెంబ్లీకి వస్తానంటున్నారని ఆయన రాకపోతే అనర్హతా వేటు పడుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అరవై రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హతా వేటు ఆటోమేటిక్ గా పడుతుందని.. పులివెందులకు ఉపఎన్నికలు వస్తాయన్నారు. అయితే ఇక్కడ ఓ నిబంధన వర్తిస్తుంది. ముందుగా స్పీకర్ అనుమతి తీసుకుని గైర్హాజరు కావొచ్చు. ఎలాంటి అనుమతి లేకుండా సమాచారం లేకుండా మాత్రం అసెంబ్లీకి వెళ్లకపోతే సభ్యులపై అనర్హతా వేటు వేయవచ్చు.
జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి మాత్రమే వెళ్లారు. ఆ తర్వాత వెళ్లలేదు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలను పంపడం లేదు. దాంతో అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యేలుగా వారు మిగిలిపోయారు. అసెంబ్లీకి వెళ్లకపోవడం వల్ల ప్రజల్లోనూ వారికి మద్దతు కనిపించే అవకాశం లేదు. ఒక వేళ అనర్హతా వేటు వేస్తే న్యాయస్థానాల్లోనూ ఊరట లభించే అవకాశాలు తక్కువ ఉంటాయి. అదే జరిగితే ఉపఎన్నికలు వస్తాయి. ఉపఎన్నికల్లో పులివెందుల సీటు కూడా నిలబెట్టుకోవడం కష్టమన్న అభిప్రాయం ఉంది. అందుకే జగన్ రిస్క్ లేకుండా ఒకటి, రెండు రోజుల్లో సభకు హాజరై ఆ తర్వాత మరో రెండు, మూడు సెషన్లు రాకుండా ఉండవచ్చని చెబుతున్నారు.
జగన్ అసెంబ్లీకి హాజరవుతారని.. వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ నెలలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. జగన్ లండన్ నుంచి వచ్చినప్పటి నుంచి ఈ ప్రచారం ఊపందుకుంది. తాజాగా ఆయన విజయవాడకు వచ్చారు. ఈ అంశంపై ఎమ్మెల్యేలకు ఏమైనా క్లారిటీ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. వైసీపీ సోషల్ మీడియా మాత్రం ప్రచారం చేస్తోంది.