చరిత్రలో పేరొందిన నియంతలు పెట్టుకునే సెక్యూరిటీ గురించి కథలు కథలుగా జనం చెప్పుకుంటారు. గడాఫీ, సద్దాం, కిమ్ వంటి వాళ్లు భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారో.. ఎంత మందిని నియమించుకుంటారో ..ఎలాంటి వేషాలు వేస్తారో అంతర్జాతీయ మీడియాలో వచ్చినప్పుడు “అబ్బో.. అతి” అనుకుంటాం, కానీ అలాంటి సెక్యూరిటీ కథల్ని మనకు కూడా జగన్ వినిపించే స్థితికి వచ్చారు. ఆయన సెక్యూరిటీ కి చేసిన ఏర్పాట్లు ఇంత కాలం సీక్రెట్ గా ఉన్నాయి. ఇప్పుడు బయటకు వచ్చాయి.
ఐదేళ్లు వర్క్ ఫ్రం ప్యాలెస్ చేసిన జగన్ రెడ్డికి సెక్యూరిటీకి రోజుకు 950 మందికిపైగా ఉండేవాళ్లు. అందులో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ కూడా ఉంది. బ్లాక్ క్యాట్ కమెండోల్లా వారికి డ్రెస్సింగ్ చేసి ఆధునిక ఆయుధాలతో నిలబెట్టేవారు. తాడేపల్లి ప్యాలెస్ అంటే… చీమ కూడా అటు వైపు పోకుండా చూట్టూ చెక్ పోస్టులు అంతర్జాతీయ స్థాయి భద్రతా ఏర్పాట్లు చేశారు. జగన్ బయటకు అడుగుపెడితే ఆయన కారు చుట్టూ పరుగులు పెడుతూ మూడు వందల మంది పోలీసులు ఉంటారు. కిలోమీటర్ దూరం వరకూ మరో వాహనం ఉండదు. అంతేనా రోడ్డుపై వెళ్తే చెట్లు, పుట్టలూ ఉండకూడదు.
ఘనత వహించిన నియంతలు… ప్రజల్ని భయపెట్టడానికి… తిరుగుబాటు చేయకుండా ఉండటానికి..తనపై దాడులు జరగకుండా ఉండటానికీ ఈ ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ జగన్కు ఎందుకు ?. ఆయన ప్రజల్లో తిరిగి సీఎం అయ్యారు.. ఆయనకు ఎందుకు అంత భద్రత ?. ఎవరికీ లేని ముప్పు ఆయనకు ఎందుకు ఉంటుంది అంటే… నియంతల్నే ఆదర్శంగా తీసుకున్నారు. తానేదో పై నుంచి దిగొచ్చాన్న భ్రమ కల్పించడానికి ఏర్పాట్లు చేసుకున్నాయి. పదవిపోయాక ఇప్పుడు కార్యకర్తల్ని కారు దగ్గరకు పిలిపించుకుని షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు. అదీ ఆయన నిర్వాకం.
ఒక్క జగన్ రెడ్డి భద్రత కోసం… ప్రభుత్వనికి వందల కోట్లు ఖర్చయింది. ఎంత ఆడంబరం అంటే… ఎన్నికలు అయిపోయి.. ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా పీకేసిన తీర్పు బ్యాలెట్లలో నిక్షిప్తం అయి ఉంటే.. లండన్ పర్యటనకు వెళ్తే అక్కడకు తన కంటే ముందే సిబ్బందిని పంపి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడం. ప్రజాధనాన్ని ఎంత దారుణంగా సొంతానికి వాడుకున్నారో ఇలాంటివి బయటపడినప్పుడే తెలుస్తుంది.