ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఎప్పుడు కలిసినా అడుగుతానన్నవి అడుగుతారు. కానీ.. అడగకపోయినా చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నాలుగు నెలల కాలంలోనే… కేంద్రాన్ని ధిక్కరించేలా తీసుకున్న అనేక నిర్ణయాలపై వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాల్లో అనేక సార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా. చేసిందంతా చేసి.. ఇప్పుడు.. కేంద్రం సాయం కోసం వెళ్తే .. ప్రధాని ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరం..!. నాలుగు నెలల కాలానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాల కు సంబధించి పూర్తి స్థాయి వివరణలను… అధికారులు సిద్ధం చేశారు.
కరెంట్ కొరతకు కారణం ఏమని చెబుతారు..?
ఆంధ్రప్రదేశ్‌కు అదనపు బొగ్గు కేటాయించాలని.. విద్యుత్ కోతలు ప్రారంభమైన తొలి రోజుల్లో కేంద్రానికి ఓ లేఖ రాశారు అధికారులు. అయితే.. దానికి స్పందనేమీ కనిపించ లేదు. విద్యత్ కొరత అంతకంతకూ తీవ్రమవుతున్నందున.. జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా మోదీని మరింత బొగ్గు కోసం విజ్ఞప్తి చేస్తారు. కానీ.. ఐదేళ్లు నిరంతర విద్యుత్ ఉన్న రాష్ట్రానికి ఇప్పుడెందుకీ కష్టాలు అని.. ప్రధానమంత్రి నుంచి కానీ.. పీఎంవో అధికారుల నుంచి కానీ వస్తే.. ఏపీ సీఎం సమాధానం చెప్పుకోలేరు. సౌర, పవన విద్యుత్ కొనుగోళ్లు నిలిపివేయడంతోనే సమస్య వచ్చిందని జగన్ అంగీకరించలేరు. ఎందుకంటే.. ఈ ఒప్పందాల విషయంలో జగన్మోహన్ రెడ్డి తీరును.. కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది. సాక్షాత్తూ కేంద్ర విద్యుత్ మంత్రే.. హెచ్చరికల్లాంటి సూచనలు చేశారు. అయినా… ఏపీ సీఎం వెనక్కి తగ్గలేదు. తాను చేయాలనుకున్నదే చేశారు. ఇప్పుడు కరెంట్ లేదని.. బొగ్గు కావాలంటూ.. కేంద్రం వద్దకువెళ్తున్నారు.
పోలవరం రివర్స్‌పై ఏం వివరణ ఇవ్వబోతున్నారు..?
పోలవరం రివర్స్ టెండర్లపైనా .. ప్రధానికి జగన్మోహన్ రెడ్డివివరణ ఇవ్వక తప్పని పరిస్థితి ఉంది. పోలవరం జాతీయ ప్రాజెక్ట్. నిర్మాణ నిర్వహణ మాత్రమే ఏపీ సర్కార్ ది. ఏ నిర్ణయం అయినా కేంద్ర ప్రభుత్వం .. నియమించిన పోలవరం ప్రాజెక్ట్ ఆధారిటీ ద్వారానే తీసుకోవాలి. జలశక్తి మంత్రి అంతిమ నిర్ణయం తీసుకోవాలి. పీపీఏ అనుమతి లేకుండా.. టెండర్లు పిలిచే అధికారం కూడా ఏపీ సర్కార్ కు లేదు. అయినప్పటికీ పీపీఏ వద్దన్నా.. కోర్టు స్టే ఉన్నా టెండర్లు ఖరారు చేసేశామని.. 8వందల కోట్లు ఆదా చేశామని గంభీరమైన ప్రకటనలు చేస్తోంది. అంటే.. అంతకు తగ్గ అవినీతి జరిగిందని.. ప్రచారం చేస్తున్నారు. ఈ రివర్స్ టెండర్ల లోగుట్టేమిటో.. బీజేపీ నేతలకు ఇప్పటికే క్లారిటీ ఉంది. ఈ విషయాన్ని కన్నా.. నివేదిక రూపంలో కేంద్రానికి అందించారు. ఇప్పుడు వాటిపై.. జగన్ వివరణ ఇవ్వాల్సి ఉంది. కేంద్రాన్ని ఎందుకు లెక్కలోకి తీసుకోవడం లేదో.. జగన్.. ప్రధానికి క్లారిటీగా చెప్పాల్సి ఉంటుంది.
జీఎస్టీ ఆదాయం పడిపోవడానికి ఏం లెక్కలు చెబుతారు..?
రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. జీతభత్యాలు సమయానికి ఇవ్వలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో.. కేంద్రం ఆదుకోవాలని.. ఏపీ సీఎం కోరడం సహజమైన విషయం . కానీ .. ఆంధ్రప్రదేశ్ ఆదాయం ఎందుకు తగ్గిపోయిందంటే.. జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతారు..?. పరిణితి లేని నిర్ణయాలతో ఇసుక అందుబాటులో లేకుండా చేసినందున… వ్యాపార వ్యవహారాలు తగ్గిపోయాయని చెబుతారా..?. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీ అభివృద్ధి పనిని.. నిలిపి వేసినందుకు ఆదాయం తగ్గిపోయిందని చెబుతారా..?. వేల కోట్ల రూపాయలు పనులు జరుగుతున్న అమరావతిని ఆపేసినందుకు ఆదాయం తగ్గిపోయిందని చెబుతారా…?