ప్రభుత్వ ప్రధాన ప్రతిపక్షాల మధ్య కనీసస్థాయి అవగాహన కూడా లేకుండా పోవడంతో ఆంధ్ర ప్రదేశ్ ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. శాసనసభ ఎప్పుడూ రణరంగంగా మారడం, చివరకు ప్రతిపక్షం సభనే బహిష్కరించడం ఇందులో భాగమే. ఈ సారి కూడా వెళ్లాలా వద్దా అని వైసీపీ తర్జనభర్జనలు చేస్తున్నది. అమరావతి రాజధాని శంకుస్థాపనకు ప్రతిపక్ష నేత జగన్‌ను పిలిస్తే రాలేదనే పేరుతో టిడిపి అన్నీ తనే చేసుకుపోతున్నది. ఇతర ప్రతిపక్షాలకు సభలో ప్రాతినిధ్యం లేదు గనక వాటిని అసలే ఖాతరు చేయడం లేదు. ఇటీవల ప్రత్యేక హౌదాపై అఖిలపక్షం వార్తలు రాగా వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని సవరించారు. ఇంతకూ ఈ సంబంధాల క్షీణత వల్ల కొన్ని కీలకమైన పనులే మిగిలిపోతున్నాయి.రాష్ట్ర సమాచార కమిషనర్‌ను ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కలసి నిర్ణయించాలి. గతంలో చంద్రబాబు కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో వివాదాలున్నా ఎలాగో అయిందనిపించేవారు. కాని ఇప్పుడు జగన్ సమాచార కమిషనర్ నియామకంపై చర్చలకు ససేమిరా రానంటున్నారట. దాంతో ఆ నియామకమే ఆగిపోయింది. ప్రస్తుతం పాదయాత్రలో వున్న జగన్ తిరిగివచ్చి ఈ చర్చలలో పాల్గొనడం నిర్ణయం నియామకం పూర్తికావడం ఇప్పటికైతే జరిగేలా కనిపించడం లేదు.పైగా ఆయన తన అధికారాన్ని మరొకరికి బదలాయించే లక్షణం కూడా లేదు.