మాజీ ప్రధాని మరియు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అయిన దేవేగౌడ, జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఆయన అపాయింట్మెంట్ కోరుతూ ఉన్నాడు. అయితే జగన్ మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వకుండా తానే బెంగళూరు వచ్చినప్పుడు కలుస్తాను అని చెబుతూ వస్తున్నాడు. రాజకీయ వర్గాల్లో దీనికి సంబంధించి ఓ ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తోంది.
నిజానికి దేవే గౌడ జగన్ తో పాటు కెసిఆర్ అపాయింట్మెంట్ కూడా కోరాడు. కెసిఆర్ దేవెగౌడ ను కలవడానికి ఒప్పు కున్నాడు. అయితే జగన్ మాత్రం పెద్దాయనకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి వెనుకాడుతున్నాడు. “మీరు పెద్దవారు కాబట్టి మీరు విజయవాడ రావడం కాకుండా, నేనే బెంగళూరు వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాను” అంటూ దేవేగౌడ కు జగన్ తరఫు నుండి రిప్లై ఇచ్చింది ముఖ్యమంత్రి కార్యాలయం. కొందరు వైఎస్ఆర్సిపి నాయకులు మాత్రం గత లోక్సభ ఎన్నికల సమయంలో, అంతకుముందు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబుతో దేవే గౌడ సన్నిహితంగా ఉన్న కారణం చేతనే జగన్ ఆయనకు అపాయింట్మెంట్ నిరాకరిస్తూన్నాడు అని చెప్పుకుంటున్నారు.
అయితే దీని వెనకాల ఉన్న అసలైన కారణం మాత్రం వేరే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకించి దేవేగౌడ కి చెందిన జెడిఎస్ పార్టీ కర్ణాటకలో బిజెపికి వ్యతిరేకంగా ఉంది. అప్పట్లో కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం కూలిపోయిన తరువాత దేవేగౌడ ప్రాంతీయ పార్టీల అధ్యక్షులను కలుస్తున్నారు. ఒకవేళ దేవేగౌడ కు అపాయింట్మెంట్ ఇస్తే కచ్చితంగా అది కేంద్ర పెద్దలకు చేరుతుందని, బిజెపి పెద్దలకు దీని ద్వారా తప్పుడు సిగ్నల్స్ వెళ్తాయని, తనపై ఉన్న సీబీఐ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల దృష్ట్యా ఇది తనకు కానీ, తన ప్రభుత్వానికి కానీ ఏ మాత్రం మంచిది కాదని జగన్ అభిప్రాయ పడుతున్నారు అని, అందువల్లే పెద్దాయనకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి జగన్ వెనుకాడుతున్నాడని రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు జరుగుతున్నాయి.
మొత్తానికి పొరుగు రాష్ట్ర నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వాలంటే కూడా బిజెపికి భయపడే పరిస్థితి లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నాడంటూ ప్రత్యర్థి పార్టీ అభిమానులు జగన్ ని విమర్శిస్తున్నారు.