పార్టీ నేతల్ని కొంత మందిని పిలిపించుకుని వారిని ఉద్దేశించి జగన్ అప్పుడప్పుడూ స్పీచ్‌లు ఇస్తూంటారు. అందులో కామన్ పాయింట్స్ ఉంటాయి. బిర్యానీలు.. పథకాలు.. నిధులు ఇలా చెప్పుకుంటూ పోతారు. తాను ఓడిపోగానే రాష్ట్రం అంతా ఆకలితో అలమటిస్తోందని ఫీలవుతారు. అయితే అదే సందర్భంలో తన పార్టీ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉందని పరోక్షంగా అయినా అంగీకరిస్తున్నారు. కార్యకర్తల్ని గతంలో పట్టించుకోలేదని ఈ సారి అలాంటి తప్పు జరగనివ్వబోనని హమీలు ఇస్తున్నారు. తాను ప్రతి జిల్లాకు వస్తానని రెండు రోజుల పాటు కార్యకర్తలతో సమావేశమవుతానని చెప్పుకొచ్చారు.
సంక్రాంతి అయిపోగానే జిల్లాల పర్యటన ఉంటుందని చెప్పిన ఆయన .. ఫిబ్రవరి ఐదో తేదీ వచ్చినా షెడ్యూల్ మాత్రం ఖరారు చేసుకోలేకపోయారు. బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన ఆయన కొంత మంది నేతలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలోనూ జిల్లాల పర్యటనపై పెద్దగా చర్చ జరగలేదని చెబుతున్నారు. జగన్ ముభావంగా ఉంటున్నారని.. ఆయన ఏదో పార్టీని పట్టించుకుంటున్నారని చెప్పుకోవడానికి పిలిపించారని అక్కడి నేతలకు అర్థమయింది. విజయసాయిరెడ్డి అంశంపై ఆయన పార్టీ నేతలతో మాట్లాడటం లేదు సజ్జల రామకృష్ణారెడ్డి.. అసలు ఆ విషయం ప్రస్తావించవద్దని జగన్ కు సలహా ఇచ్చారని అంటున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జిల్లాల పర్యటన పెట్టుకుంటే ఎలా అన్న ఆలోచనలో ఎక్కువ మంది ఉన్నారు. అత్యధిక మంది నేతలు పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. జిల్లాలకు వెళ్తే వారు సహకరిస్తారో లేదో తెలియని పరిస్థితి ఉంది. జగన్ వస్తారని ఎలా ప్లాన్ చేద్దామని పార్టీ నేతల్ని అడుగుతూంటే.. వారు స్పందించడం లేదని అంటున్నారు. ఫీజు పోరుపై కూడా.. ఎవరూ ఆందోళనలు చేసేందుకు సిద్ధం కాకపోవడంతో రెండు నెలల తర్వాతకు వాయిదా వేశారు. ఈ క్రమంలో జగన్ జిల్లాల పర్యటనకు నేతల సపోర్టు లేకుండా వెళ్లడానికి సంకోచిస్తున్నారు.