ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ‘అహో నయవంచకా..’ అంటూ వ్యక్తిగత విమర్శలపైనే ప్రాధాన్యత ఇచ్చారు. ‘మళ్లీ నువ్వే రావాలని ఎవరు కోరారయ్యా’ అంటూ ఎద్దేవా చేస్తూ ప్రసంగం కొనసాగించారు. ‘ఒకసారి మోసం చేశావు, మరోసారి చెయ్యలేవు. ఈ వ్యవస్థ బాగుపడాలంటే, విశ్వసనీయత రావాలంటే పొరపాటున చంద్రబాబు నాయుడు మరోసారి రాకూడదు. మరోసారి ఈయన్ని క్షమిస్తే.. ప్రతీ ఇంటికీ కిలో బంగారం ఇస్తారననీ, బెంజికారు ఇస్తానంటారు’…. ఇలా తన పంథాలో విమర్శలు చేశారు. ‘పొరపాటున’ చంద్రబాబు నాయుడు వస్తే… ‘పొరపాటున’ మళ్లీ అధికారంలోకి వస్తే… ‘పొరపాటున’ మళ్లీ అవకాశం ఇస్తే… ఇలా తన ప్రసంగంలో జగన్ చాలాసార్లు ప్రస్థావించారు. అంటే, పదేపదే ‘పొరపాటున’ అంటుండం ద్వారా తన ప్రయత్నంపై జగన్ కే అభద్రత ఉందేమో అనే అనుమానం కలుగుతోంది!
అనకాపల్లిలో మాత్రమే కాదు, జగన్ ప్రసంగాల్లో ఎక్కువగా కనిపించేవి.. ఫలితాల ప్రస్థావన. ఫలితాల గురించే మాట్లాడుతున్నారు. అంటే, ‘మనందరి ప్రభుత్వం రాగానే… ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు వస్తుంద’న్నారు. ఆరోజే విశ్వసనీయత వస్తుందన్నారు. అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. రైతన్నలు సంతోషంగా ఉంటారంటారు. ఇలాంటివన్నీ ఫలితాలే కదా! ఇవన్నీ జరగాలంటే… వాటికంటే ముందు ఒక ‘ప్రయత్నం’ ఉండాలి. పేదవాడి ముఖంలో చిరునవ్వు ఎలా వస్తుంది… పేదరికాన్ని తగ్గించినప్పుడు. అదెలా సాధ్యం, ఉపాధి కల్పన ద్వారా చేస్తారా, కేవలం పెన్షన్లు పెంచేసి పేదరికాన్ని తగ్గించేస్తారా… జగన్ మాటల్లో ఇలాంటి స్పష్టత ఎక్కడుంది..? వ్యవస్థలోకి విశ్వసనీయత వస్తుందంటారు! అదెలా వస్తుంది, అవినీతి తగ్గించాలంటే పాలనలో పారదర్శకత పెంచాలి. అదెలా చేస్తారో జగన్ చెప్పరు! మన ప్రభుత్వం వస్తే రైతన్నలు ఆనందంగా ఉంటారంటారు. ఆ ఆనందం ఎలా తీసుకొస్తారు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ద్వారా సాధ్యమౌతుంది. ఆ చర్యల గురించి మాట్లాడరు.
ఒక మార్పు ఆశించే ముందు… దాన్ని సాధించుకునే మార్గం, ప్రయత్నం అనేవి ఉంటాయి. ప్రజలకు కావాల్సింది ఆ స్పష్టత. అంతేగానీ… మీ జీవితాలు మార్చేస్తా అంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తే, నమ్మే పరిస్థితిలో ఎవ్వరూ లేరు. ఈ మధ్య జగన్ ప్రసంగాల్లో ఈ ఫలితాల ప్రస్థావనే ఎక్కువగా వినిపిస్తోంది. లేదంటే.. ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేయడం! తాజాగా ‘అహో నయవంచకా’ అన్నారు. ఇదేమీ చిన్నమాట కాదు. ఆ స్థాయి విమర్శ చేసినప్పుడు.. దానికి సరిపడా ఆధారాలతో కూడిన ఆరోపణలు చేస్తే ప్రజలు హర్షిస్తారు. అంతేగానీ… ఇలా ఎప్పటికప్పుడు వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యత ఇస్తూ పోతుంటే… అది జగన్ కు మైనస్ అయ్యే మాట అటుంచితే, టీడీపీకి బాగా ప్లస్ అవుతుందని వారి అనిపిస్తోందో లేదో మరి!