జమ్మలమడుగు రామసుబ్బారెడ్డికి జగన్మోహన్ రెడ్డి గట్టి షాక్ ఇచ్చారు. పార్టీ టిక్కెట్ ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి పని చేసుకోవాలని పిలిచి మరీ చెప్పి పంపారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని కూడా కాదని.. టీడీపీలో ఉన్న ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరకు తీసుకుని.. నియోజకవర్గంలో ప్రతీ గ్రామంలో వర్గం ఉన్న తనకు టిక్కెట్ ఇస్తారని ఆశపడ్డారు. కానీ.. వైసీపీలో చేరిన తరవాత ఆయనకు కనీస గౌరవం లేకుండా పోయింది. ఆయన అనుచరులు హత్యకు కూడా గురయ్యారు. తనకు పార్టీలో కనీస గౌరవం దక్కడం లేదని.. ఆయన అనేక సార్లు వాపోయారు.
అయినా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి … రామసుబ్బారెడ్డిని పట్టించుకోవడం లేదు. ఆర్థికంగా ఆదుకునేందుకు ఓ మైనింగ్ కాంట్రాక్ట్‌ను.. రామసుబ్బారెడ్డి కొడుక్కి ఇవ్వాలనుకున్నారు. కానీ.. దాన్ని కూడా సుధీర్ రెడ్డి అడ్డుకుంటున్నారు. అయినా ఏమీ చేయలేని పరిస్థితిలో పడ్డారు. చివరికి రామసుబ్బారెడ్డి అసంతృప్తిని ముందే తుంచేయాలని జగన్మోహన్ రెడ్డి పిలిపించారు. సజ్జల సమక్షంలో చెప్పాల్సింది చెప్పారు. ఇప్పుడు కాదు.. 2029 వరకూ ఎలాంటి టిక్కెట్ ఇచ్చే చాన్స్ లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నారు కానీ అది కూడా ఇప్పుడు కాదు. 2023లో చూద్దామని చెప్పి పంపేశారు. వచ్చే ఎన్నికల్లోనూ సుధీర్ రెడ్డికే టిక్కెట్ అని రామసుబ్బారెడ్డికి చెప్పి పంపేశారు. దీంతో రామసుబ్బారెడ్డికి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.
టీడీపీని వీడి వర్గాన్ని పోగొట్టుకున్నా… ప్రయోజనం లేకపోవడంతో ఆయన మథనపడుతున్నారు. పార్టీలో క్రియాశీలకంగా ఉంచి.. తగిన గుర్తింపు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని.. రామసుబ్బారెడ్డి నిర్వేదంగా చెప్పుకున్నారు. ఇప్పటికి అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి… రామసుబ్బారెడ్డికి పార్టీలో ఉండటం తప్ప ఏమీ చేయలేరు. వచ్చే ఎన్నికల వరకు వర్గాన్ని కాపాడుకుంటే పరిస్థితిని బట్టి ఏదో ఓ పార్టీలో చేరి పోటీ చేయవచ్చన్న వ్యూహాన్ని ఆయన అమలు చేసే అవకాశం ఉంది.