హైదరాబాద్: ప్రత్యేకహోదాపై మంగళవారంనాడు సీఎమ్‌కు, స్పీకర్‌కూ ట్యూషన్ చెప్పబోతున్నానని ఏపీ ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డి సోమవారంనాడు అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే మంగళవారంనాడు ప్రత్యేకహోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిపక్షనేతగా జగన్ చర్చను ప్రారంభించారు. ప్రిపేర చేసుకొచ్చిన కాగితాలు చదువుతూ, ప్రణాళికా సంఘం అంటే ఏమిటి, నీతి ఆయోగ్ అంటే ఏమిటి, వాటి విధులు, కేంద్ర బడ్జెట్, నిధుల కేటాయింపు గురించి సభకు తనదైన శైలిలో వివరించారు. చంద్రబాబుకు ప్రత్యేకహోదా గురించి అవగాహన లేదని, ఆయన హోమ్‌వర్క్ చేయరని అన్నారు. ఆయన ఔట్‌డేటెడ్ పొలిటీషియన్ అని, ఓల్డ్ జనరేషన్ అని వ్యాఖ్యానించారు. తాము కరెంట్ జనరేషన్ అని, బాగా హోమ్‌వర్క్ చేస్తామని, బాబుకు తెలియని విషయాలు ఎన్నో తమకు తెలుసని చెప్పారు. అంతా బాగానే ఉంది. అయితే ప్రత్యేకహోదాపై గణాంకాలు ఉటంకించే సందర్భంలో పీఆర్ఎస్ అనే సంస్థనుంచి ఈ గణాంకాలు తీసుకున్నామని, అది కేంద్ర ఆర్థికశాఖకు సంబంధించిన విభాగమని జగన్ చెప్పటమే బాగోలేదు. అప్పటికీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, అది కేంద్రప్రభుత్వ సంస్థకాదు, స్పచ్ఛందసంస్థ అని నచ్చచెప్పటానికి ప్రయత్నించారు. అయినా మనోడు ఒప్పుకోడే. ప్రభుత్వ సంస్థ గణాంకాలనుకూడా తెలుగుదేశం నేతలు అంగీకరించటంలేదని, పైగా అది ప్రైవేట్ సంస్థ అంటున్నారని, ఇది తమ ఖర్మ అని జగన్ రుసరుసలాడారు.
అసలు విషయమేమిటంటే – పీఎస్ఆర్ అనేది ఒక స్వచ్ఛందసంస్థ. చట్టసభలు, చట్టాల రూపకల్పనపై, ఎంపీల పనితీరుపై అధ్యయనం చేసి, వాటిని పారదర్శకం చేయటంకోసం పనిచేస్తూ prsindia.org అనే వెబ్సైట్నుకూడా నడుపుతోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఎంపీల పనితీరును, పార్లమెంట్‌కు వారి హాజరుశాతాన్ని బహిర్గతం చేయటంకోసం ఇదే వెబ్‌సైట్‌లోని గణాంకాలను ట్విట్టర్లో కోట్ చేశారు. జగన్‌కు ఆయన సహాయకులు పీఆర్ఎస్ అనేది ప్రభుత్వ విభాగమన్నట్లుగా తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా కనబడుతోంది. జగన్ తన సహాయక బృందాన్ని పటిష్ఠం చేయాల్సిన అవసరం ఏర్పడినట్లుంది.