ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి నుండి.. ఇంకా చెప్పాలంటే.. ప్రమాణస్వీకారం చేయక ముందు నుంచీ.. పీపీఏలపై కన్నేశారు. వాటిని సమీక్షించి తీరుతామని ప్రకటించారు. అనూహ్యంగా కేంద్రం నుంచి రెండు సార్లు… అది విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాలను దెబ్బతీస్తుందని.. అలాంటి పనులు చేయవద్దని..లేఖలు వచ్చిన ఖాతరు చేయడం లేదు. ఆ కంపెనీల ప్రతినిధుల్ని పిలిపించి మరీ.. రేట్లు తగ్గించాలని ఒత్తిడి తెస్తున్నారు. అయితే వారు కూడా.. ససేమిరా అంటున్నారు. తమకున్న మార్గాల్లో ట్రిబ్యునల్స్‌లో పిటిషన్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో… అసెంబ్లీలో.. జగన్ పీపీఏలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ … చాలా విషయాలు చెప్పారు. కానీ.. అందులోనూ.. తప్పు జరిగిపోయిందని.. అవినీతి జరిగిందనే విషయాలను మాత్రం బలంగా చెప్పలేకపోయారన్న వాదన వినిపిస్తోంది.
సంప్రదాయేతర విద్యుత్ వద్దని ఎందుకంటున్నారు..?
పీపీఏలా చాలా విషయాలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి.. రేట్ల విషయంలోనూ… క్లారిటీ ఇచ్చారు. గతంలో ఆరోపణలు చేసినట్లుగా.. ఏపీ సర్కార్ పీపీఏలకు రూ. ఆరు.. ఎనిమిది రూపాయలు పెట్టి కొనుగోలు చేయలేదు. రూ. నాలుగున్నరలోపే ఉంది. ధర్మల్ విద్యుత్ పీపీఏలు మాత్రం… రూ. నాలుగు రూపాయల కన్నా ఎక్కువగా ఉన్నాయట. ధర్మల్ విద్యుత్ తక్కువకు వస్తున్నప్పుడు… సంప్రదాయేతర ఇంధన విద్యుత్ ఎందుకు కొనుగోలు చేస్తున్నారనే వాదన వినిపించారు. మారుతున్న పరిస్థితులు.. భవిష్యత్ కరెంట్ అవసరాలు ఎలా తీరుతాయో.. అంచనాలు ఉన్న వారికి జగన్ వాదనలో ఏ మాత్రం పస లేదని తేలిపోతుందంటున్నారు.
ఒక్క రోజుకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు..!
థర్మల్ విద్యుత్ ఉత్పాదన వల్ల దేశవ్యాప్తంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బొగ్గు ధరలు ప్రతి ఏటా 4 శాతం పెరగుతున్నాయి. అలాగే కొరత ఏర్పడుతోంది. వాతావరణ కాలుష్యం కూడా పెరిగిపోతోంది… ఇలాంటి కారణాలతో పునరుత్పాదక విద్యుత్ ఉత్పాదనపై దేశం దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యరంగాల్లో ఇదీ ఒకటి. ప్రస్తుతం ఏపీలోని ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఒక్క రోజుకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. సరఫరాలో తేడా జరిగినా… లేక.. మరే కారణం వల్లనైనా బొగ్గు అందకపోతే.. కరెంట్ ఉత్పదనపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ధరల నిర్ణయంలో ఏపీ సర్కార్ పాత్ర పరిమితమని తెలియదా..?
పీపీఏల ధరల నిర్ణయం.. ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకునేది కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదు. రెగ్యులరేటరీ కమిషన్లే వీటిని నిర్ణయిస్తాయి. ఈ విషయం ముఖ్యమంత్రికి తెలుసు. తెలియకపోయినా.. సంబంధిత అధికారులు చెబుతారు. ఈ పీపీఏలపై.. గతంలో రెగ్యులేటరీ కమిషన్లు నిర్ణయించిన ధరకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే పవన విద్యుత్ ధరలు ఎక్కువగా ఉన్నాయనుకున్న అప్పటి ప్రభుత్వం … కోర్టుకు వెళ్లింది. ఆ పిటిషన్లు ఇప్పుడు విచారణలో ఉన్నాయి.