ఏపీ ముఖ్యమంత్రి జగన్ రోల్ మారిన రూట్ మాత్రం మార్చడం లేదు. ఏకపక్ష నిర్ణయాలతో పాలన కొనసాగించి చేజేతులా అధికారం పోగొట్టుకున్న జగన్ అండ్ కో.. విపక్షానికి పరిమితమయ్యాక కూడా అదే పద్దతిలో వ్యవహరిస్తున్నారు. దారుణమైన , అవమానకర ఫలితాలను మూటగట్టుకున్నా ప్రజల మెప్పును పొందే విషయంలో జగన్ ఇంకా పాఠాలు నేర్చుకోలేకపోతున్నారని ఇటీవలి పరిణామాలతో స్పష్టం అవుతోంది.
రికార్డ్ స్థాయి వర్షాలతో విజయవాడను వరదలు ముంచెత్తాయి. ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ ఆపత్కాలంలో రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తే మైలేజ్ వస్తుందని విపక్షాలకు ఆలోచనా ఉన్నా.. బాధ్యత కల్గిన ఏ రాజకీయ పార్టీ ఈ కష్టకాలంలో రాజకీయాలు చేసేందుకు ఆసక్తి చూపదు. కానీ, జగన్ మాత్రం వరదల్లోనూ రాజకీయాలు చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన వైఖరి స్పష్టం అవుతోంది.
వరద సమయంలో రాజకీయాలు చేసేందుకు వచ్చిన జగన్ ను బాధితులే నిలదీశారు. ప్రభుత్వాధినేత అర్దరాత్రి సైతం బాధితులను పరామర్శిస్తూ..భరోసా కల్పిస్తుంటే చంద్రబాబును బద్నాం చేయడం సరైంది కాదంటూ జగన్ కు వాతలు పెట్టారు. వరదలపై వైసీపీ చేస్తోన్న రాద్దాంతం వెగటు పుట్టించేలా ఉన్నా.. ఆ పార్టీ నేతలు మాత్రం అదే పంథాను ఫాలో అవుతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది.
వైసీపీ వరద రాజకీయంతో ఆ పార్టీకి వచ్చే లాభం ఏంటో కానీ, వ్యతిరేకతను మాత్రమే కొని తెచ్చుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది. ఓ వైపు వరద సహాయక చర్యలో ప్రభుత్వ యంత్రాంగమంతా పాల్గొంటుంటే..విపక్షంలో ఉండి కూడా బాధ్యతయుతంగా వ్యవహరించకుండా జగన్ అండ్ కో విమర్శలకే పరిమితమవ్వడంతో, విపక్షానికి పరిమితమైనా ప్రజల మెప్పును పొందటంలో వైసీపీ ఫెయిల్ అవుతుందని ఆ పార్టీ శ్రేణులు నిట్టూరుస్తున్నాయి.