ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయించిన తర్వాతనే ఏపీలో అడుగుపెడతానని సవాల్ చేసిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో అడుగు ముందుకేశారు. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. గతంలో ఓ సారి దాఖలు చేసిన పిటిషన్‌ను సరైన పత్రాలు లేవన్న కారణంగా కోర్టు రిటర్న్ చేసింది. ఇప్పుడు అన్ని పత్రాలు సమర్పించడంతో… కోర్టు పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. దీంతో ఈ పిటిషన్‌పై విచారణ చేయడానికి మార్గం సుగమం అయింది.
అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. ఆయన బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని సాక్షులకు.., సహ నిందితులకు అధికారం ఉపయోగించి లబ్ది చేకూరుస్తున్నారని.. పదవులు ఇస్తున్నారని రఘురామకృష్ణరాజు బెయిల్ రద్దు పిటిషన్లో పేర్కొన్నారు. తమ పార్టీ పరువు పోకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే బాధ్యాతాయుత ఎంపీగా.. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఎంపీగా తాను పిటిషన్ వేస్తున్నట్లుగా రఘురామకృష్ణరాజు చెబుతున్నారు. వైసీపీ తరపున గెలిచిన రఘురామకృష్ణరాజు ఆ పార్టీ అధినేత జగన్‌తో విబేధించారు. ఆ పార్టీ నేతలు ఆయనను వ్యక్తిగత శత్రువుగా పరిగణిస్తూండటంతో… రఘురామకృష్ణరాజు కూడా.. సీరియస్‌గా తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయించే వరకూ ఏపీలో అడుగు పెట్టబోనని సవాల్ చేశారు. ఆ మేరకు పిటిషన్ వేసి న్యాయపోరాటం చేస్తున్నారు.
ఇరవై రెండో తేదీ నుంచి రఘురామ పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లను రఘురామకృష్ణరాజు ఈ పిటిషన్‌పై వాదనల కోసం నియమించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల బీజేపీ నేతలు కూడా.. జగన్ బెయిల్ రద్దు అవుతుందంటూ హెచ్చరికలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీబీఐ ఎలా స్పందిస్తుందనేది న్యాయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సీబీఐ చాయిస్ కూడా బెయిల్ రద్దు చేయాలన్నదే అయితే.. రఘురామ పిటిషన్‌కు ఆయన కోరుకున్న ఫలితం వచ్చే అవకాశం ఉంది.