ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏపీలో ఏం జరిగినా కులమే కనిపిస్తోంది. అన్నింటిపైనా ఆయన కులం ముద్ర వేసి.. కులం కులం అని కలవరించేస్తున్నారు. అమరావతిలో ఇళ్ల స్థలాలకు.. కులాలకు లింక్ పెట్టేసి మాట్లాడిన ఆయన ఇప్పుడు… మరింత ముందుకెళ్లారు. న్యాయస్థానాల్లో దాఖలవుతున్న పిటిషన్లపై కూడా కులముద్ర వేసేశారు. కులం ప్రకారం కేసులు వేస్తున్నారని.. కోర్టులు కూడా కులం ప్రాదిపదిక స్టేలు ఇస్తున్నాయని ఆరోపించేస్తున్నారు.
కులవివక్షతో వేస్తున్న కేసులపై కోర్టులు స్టే ఇస్తున్నాయని విజయనగరం జిల్లాలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆరోపించారు. పేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు ఇస్తుంటే సహించలేని విపక్షం కోర్టులో కేసులు వేస్తోందని, ఇళ్ల పట్టాల విషయంలో కులాలకు అన్యాయం జరుగుతోందని జగన్ చెబుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి చర్యలు సహేతుకం కాదని ఆయన చెప్పుకొచ్చారు. కోర్టులపై కూడా జగన్ కులం ముద్ర వేసేందుకు వెనుకాడటం లేదు.
ప్రభుత్వం సొంత భూములు పంచితే.. ఏ కోర్టు కూడా స్టే ఇవ్వదు. బలవంతంగా లాక్కున్న భూములు, మైనింగ్ భూములు, దేవాదాయ భూములు ఇలా.. వివాదాల్లో ఉన్న భూముల విషయంలో కోర్టుకెళ్తేనే స్టే ఇచ్చింది. అయినప్పటికీ.. వాటికి కుల ముద్ర వేసి.. రాజకీయం చేసుకుందామని జగన్ ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. ప్రతీ దానికి కుల ముద్ర వేసి.. ఆయన సాధించేది ఏమిటన్న ప్రశ్న సామాన్యుల్లో వస్తోంది.