ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానాల్లో ఢిల్లీతో పాటు వివిధ ప్రాంతాలకు చేసిన పర్యటనలు, అలాగే హెలికాఫ్టర్లలో చేసిన పర్యటనల బిల్లు పదహారు నెలల కాలంలో రూ. ఇరవై ఆరు కోట్లుగా తేలింది. ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్‌కు రూ.26 కోట్ల వినియోగానికి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తున్న హెలికాఫ్టర్, ప్రైవేటు చార్టడ్ విమానాల అద్దెలకు చెల్లిస్తారు. ఈ పదహారు నెలల కాలంలో కరోనా వల్ల సీఎం జగన్ ఆరేడు నెలల పాటు పర్యటనలు చేయలేదు. హెలికాఫ్టర్లు, విమానాలు వినియోగించలేదు.
అయితే మొదట్లో ఆయన అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు తరచూ హైదరాబాద్ వెళ్లేవారు. ఉదయం ప్రత్యేక విమానంలో వెళ్లి .. సాయంత్రం విజయవాడ వచ్చేవారు. అలాగే.. ఇటీవలి కాలంలో అమిత్ షాతో… రాత్రి సమయాల్లో భేటీల కోసం తరచూ ఢిల్లీకి వెళ్తున్నారు. వెళ్లేటప్పుడు ప్రైవేటు చార్టర్డ్ విమానాల్లోనే వెళ్తున్నారు. వాటన్నింటికీ ఖర్చు రూ. 26 కోట్లుగా లెక్క తేలింది. ఇది కేవలం.. హెలికాఫ్టర్లు, విమానాల అద్దెకు సంబంధించినదే. ఇతర ఖర్చులు ఇతర విభాగాలు పెట్టుకుంటాయి.
గత ప్రభుత్వంలోనూ చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా ఎక్కువగా ప్రైవేటు జెట్స్‌లోనే వెళ్లేవారు. ప్రజాధనం వృధా చేస్తున్నారని అప్పట్లో వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శించేవారు. అప్పుడు చంద్రబాబు ఎంత ఖర్చు పెట్టారో ప్రభుత్వం బయట పెట్టలేదు కానీ.. ఇప్పుడు.. ఆయా ఖర్చుల కోసం నిధులు విడుదల చేయాల్సి రావడం వల్ల.. ప్రస్తుత ప్రభుత్వం పెడుతున్న ఖర్చుల వివరాలు వెలుగులోకి వస్తున్నాయి.