ఏపీలో ఓ పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించాలంటూ లక్షల్లో వచ్చిన దరఖాస్తులు తమపార్టీ పనేనని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. నెల్లూరులో శంఖారావం సభలో ప్రసంగించిన ఆయన దొంగ ఓట్లు, నకిలీ ఓట్లు తొలగించాలని ఫిర్యాదు చేయడం తప్పా అని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి ఈసికి ఫిర్యాదు చేశామని, అలాగే ఫామ్ -7లు కూడా పెట్టామని నేరుగా చెప్పేశారు. టీడీపీ దొంగ ఓట్లు నమోదు చేసిందని, అందుకే వ్యూహాత్మకంగా తాము ఫామ్ -7లు పంపామని చెప్పుకొచ్చారు. తమ ఓట్లు తొలగించడానికి టీడీపీ నేతలు చేశారని వైసీపీ నేతలు ఇప్పటి వరకూ ఆరోపిస్తున్నారు. జగన్ మీడియాలోనూ అదే చెబుతున్నారు. కానీ తొలగించాలని వచ్చిన దరఖాస్తులు మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలవే కావడంతో ఆ పార్టీ నేతలు ఆందోళనకు గురయ్యారు.
గత వారంలో ఏకంగా వారానికి లక్షకుపైగా దరఖాస్తులు వచ్చాయని, మొత్తం ఇలా ఎనిమిది నుంచి పది లక్షల ఓట్ల దరఖాస్తులు వచ్చాయని లెక్క తేలింది. దీనిపై ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేదీ కూడా స్పందించారు. ఈ నకిలీ ఫామ్ -7లపై దృష్టి పెట్టాలని అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అన్ని చోట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఫేక్ పేర్లతో ఈ ఫామ్ -7లు అప్లయ్ చేసినట్లు తేలడంతో ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా దాదాపుగా రెండు వందల కేసులు నమోదయ్యాయి. అయితే ఇలా వచ్చిన దరఖాస్తులతో తమకు సంబంధం లేదని ఆయా వ్యక్తులు స్పష్టం చేస్తూండటంతో ఐపీ అడ్రసులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఐపీ అడ్రస్‌ల కోసం సీ డాక్‌ను సంప్రదించింది.
ఆ సమాచారం రాగానే పోలీసులకు ఇస్తామని గోపాలకృష్ణ ద్వీవేదీ ప్రకటించారు. ఈ లోపే తమ పార్టీ కార్యకర్తలే ఫామ్ -7లకు అప్లయ్ చేశారని జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రకటించారు. ఓ వైపు ఏపీలో ఓట్ల తొలగింపునకు హైదరాబాద్ నుంచి భారీ కుట్ర జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వందల క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. టీడీపీ యాప్‌కు ఓట్ల తొలగింపు దరఖాస్తులకు సంబంధం ఉన్నట్లు సైబరాబాద్ సీపీ చెప్పుకొచ్చారు. కానీ మొత్తం వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉండటంతో జగన్ అంగీకరించారన్న ప్రచారం జరుగుతోంది.