ఉత్కంఠ వీడింది.. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు పులివెందుల ఎమ్మెల్యే జగన్ హాజరుపై స్పష్టత వచ్చేసింది. ఈ నెల 22 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు అవుతారని వైసీపీ నేతలు వెల్లడించారు.
ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత మొదటిసారి జరిగిన శాసన సభ సమావేశాల్లో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి వెంటనే అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడాన్ని అవమానంగా భావిస్తున్న జగన్..అసెంబ్లీలో కూటమి సభ్యులను ఎదుర్కొవడం అంతా ఈజీ కూడా కాదు. అందుకే మొదటిసారి జరిగిన సమావేశాల్లో కాసేపు కూడా అసెంబ్లీలో కూర్చునేందుకు ఇష్టపడలేదు. పైగా.. అసెంబ్లీకి వెళ్లి చేసేదేమీ లేదని ఆయన చేతులెత్తేశారు. దీంతో సోమవారం నుంచి ప్రారంభం కానున్న సమావేశాలకు జగన్ హాజరుపై సస్పెన్స్ నెలకొంది. జగన్ మనస్తత్వం తెలిసిన వారంతా అసెంబ్లీకి రారని తేల్చేశారు. కానీ, అనూహ్యంగా ఆయన అసెంబ్లీకి హాజరు కావాలని నిర్ణయించినట్లుగా చెప్పుకొచ్చారు.
జగన్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోతే కూటమి పార్టీల నుంచే కాదు.. ప్రజల నుంచి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీకి వెళ్ళకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం ఉంది. పైగా.. వరుస శ్వేతపత్రాలతో జగన్ హయాంలో జరిగిన విధ్వంసాన్ని చంద్రబాబు బయటపెడుతుండటంతోనే అసెంబ్లీకి రాకుండా పారిపోయారన్న ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే జగన్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే, ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేగానే జగన్ అసెంబ్లీ చర్చలో పాల్గొనాల్సి ఉంటుంది. మాజీ సీఎం కావడంతో జగన్ కు అధికార పార్టీ తగిన సమయం ఇస్తుందా..? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
నిబంధనల ప్రకారం ఆయనకు సాధారణ ఎమ్మెల్యేగానే చర్చలపై మాట్లాడేందుకు సమయం ఇస్తారు. కానీ నిబంధనలతో పని లేకుండా తమకు ఎక్కువ సమయం ఇవ్వడం లేదంటూ దీనిని అవకాశంగా మలుచుకొని జగన్ అసెంబ్లీని బహిష్కరించే ఆలోచనలో ఉన్నారన్న అబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీని ద్వారా ప్రజల్లో సానుభూతి పొందటమే కాకుండా..అధికార పార్టీ సభ్యుల ఉక్కపోత నుంచి తప్పిచుకోవచ్చుననే వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకొని ఉంటారన్న వాదనలు వినిప్పిస్తున్నాయి.