జగన్మోహన్ రెడ్డి తొందరపాటు నిర్ణయాలకు వైకాపా చాలా సార్లు మూల్యం చెల్లించింది. సమైక్యాంధ్ర కోసం తెలంగాణా రాష్ట్రాన్ని విడిచిపెట్టడం మొదలుకొని ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష వరకు అనేక విషయాలలో తొందరపాటు ప్రదర్శించి జగన్ తను నలుగురిలో నవ్వులపాలవడమే కాకుండా పార్టీకి కూడా చాలా అగ్నిపరీక్షలు ఎదుర్కొనే పరిస్థితులు కల్పించారు. మళ్ళీ మొన్న తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్యపానంపై నిషేధం విధిస్తామని, దాని కోసం తెదేపా ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెస్తామని హడావుడిగా ప్రకటించేశారు.
తెదేపా ప్రభుత్వాన్ని, తన ప్రియ శత్రువు చంద్రబాబు నాయుడుని దెబ్బ తీయడానికి చాల మంచి అవకాశం దొరికిందని సంబరపడ్డారు. కానీ ఆ తొందరలో తన స్వంత పార్టీలోనే అనేక మంది నేతలు మద్యం వ్యాపారంలో ఉన్న సంగతి ఆయన మరిచిపోయారు. ఆయన చేసిన ప్రకటనని వారు సమర్ధించలేక, వ్యతిరేకించలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే బొత్స సత్యనారాయణ వంటి నేతలు మౌనం వహించవలసి వచ్చింది. ఆ హడావుడిలో జగన్మోహన్ రెడ్డి మరో ముఖ్యమయిన విషయం పట్టించుకోలేదు. కల్తీ మద్యం అమ్మిన బార్ అధికార తెదేపా నేతది కాదు. విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణుది. కనుకనే జగన్మోహన్ రెడ్డి ఊహించిన దానికంటే వేగంగా రాష్ట్ర ప్రభుత్వం మల్లాది విష్ణుపై చర్యలకు సిద్దమయింది. తత్ఫలితంగా ప్రభుత్వం కల్తీ మద్యం విషయంలో చాలా సీరియస్ గా ఉందనే భావన ప్రజలకు కలిగింది.
జగన్మోహన్ రెడ్డి ఆశించినది ఒకటయితే జరిగింది…జరుగుతున్నది మరొకటి. ఆయన మద్యపాన నిషేధం గురించి మాట్లాడిన తరువాత, తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైకాపా నేతలే మద్యం వ్యాపారాలలో చేస్తున్నారని ఎత్తిపొడిచారు. జగన్ తొందరపాటుతో చేసిన చిన్న ప్రకటనను ఇప్పుడు వెనక్కి తీసుకోలేరు. తీసుకొంటే ప్రజలు నవ్వుతారు. తెదేపా విమర్శలు గుప్పిస్తుంది. అలాగని స్వంత పార్టీ నేతలే మద్యం వ్యాపారాలు చేసుకొంటుంటే ఆయన మద్యపానంపై నిషేధం గురించి గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయలేరు. ఒకవేళ నిలదీస్తే మళ్ళీ తెదేపా నేతలు ఇచ్చే సమాధానం విని జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేరు.
బహుశః అందుకే పార్టీలో నేతలెవరూ మద్యం వ్యాపారాలు చేయకూడదని పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంతరెడ్డి చేత చెప్పించారు. ఒకవేళ జగన్ మరీ ఒత్తిడి చేసినట్లయితే, పార్టీలో మద్యం వ్యాపారాలు చేసుకొంటున్న బొత్స సత్యనారాయణ వంటి నేతలు చాలా మంది పార్టీకి గుడ్ బై చెప్పే ప్రమాదం ఉంది. పోనీ మధ్యే మార్గంగా వారందరూ బినామీ పేర్లతో మద్యం వ్యాపారాలు చేసుకొందామనుకొంటే, ప్రభుత్వం తలుచుకొంటే అవన్నీ వారివేనని నిరూపించడం పెద్ద కష్టమేమీ కాదు. మల్లాది విష్ణు కేసే అందుకు మంచి ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుని దెబ్బ తీయబోయి తన తొందరపాటు కారణంగా స్వంత పార్టీలోనే అగ్గి రాజేసుకొన్నారు. మరో మూడేళ్ళ తరువాత తమ పార్టీయే తప్పకుండా అధికారంలోకి వస్తుందని, అప్పుడు రాష్ట్రంలో మద్యపానంపై నిషేధం విధిస్తామని జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పారు. కానీ ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు కల్పిస్తే అంతకంటే చాలా ముందుగానే పార్టీ ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది.