ఆంధ్రప్రదేశ్ సర్కార్.. పారిశ్రామికీకరణపై దృష్టి సారించింది. సరికొత్తగా పెట్టుబడుల సదస్సును ఏర్పాటు చేస్తోంది. ముందుగా ప్రపంచంలో ఉన్న ముఖ్య దేశాలన్నింటికీ.. ఏపీలో ఉన్న అవకాశాలపై ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం డిప్లొమాటిక్ ఔట్రీచ్ పేరుతో శుక్రవారం సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు 35 దేశాల ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. వివిధ రంగాల్లో ప్రాధాన్యత అంశాలను రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది. పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారిస్తుంది. ఫార్మా, ఆటోమొబైల్, స్టీల్, టెక్స్ టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్.. ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలపై సీఎం జగన్ ప్రజంటేషన్ ఇస్తారు. అలాగే.. నవరత్నాల గురించి సీఎం సలహాదారు శామ్యూల్ 35 దేశాల ప్రతినిధులకు వివరిస్తారు. రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దేలా.. ఏపీలో అమలవుతున్న పారిశ్రామిక విధానాలు, పెట్టుబడుల అవకాశాలు, సానుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు, ఖనిజ వనరుల లభ్యత వంటి వాటిని దేశీయ, విదేశీ పారిశ్రామిక వేత్తలకు ఈ ఔట్ రీచ్ సదస్సు ద్వారా వివరిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
కేంద్ర విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో ఈ పారిశ్రామిక సదస్సు జరుగుతోంది. పరిశ్రమల శాఖ అనుసరిస్తున్న విధానాలు, పెట్టుబడుల అవకాశాలను దౌత్యవేత్తలకు వివరించనున్నారు. సదస్సుకు హాజరయ్యే దౌత్యవేత్తలతో సీఎం జగన్ విడివిడిగా సమావేశమవుతారు. వివిధ దేశాలతో వ్యాపార సంబంధాలు మెరుగుపరుచుకుని పటిష్ఠమైన వ్యాపార బంధం కొనసాగేలా రాష్ట్రంలో ఆయా దేశాలకు చెందిన డెస్క్‌లను ఏర్పాటు చేయాలని సీఎం కోరనున్నారు. భారత పరిశ్రమల సమాఖ్య, ఫిక్కీ వంటి సంస్థల భాగస్వామ్యంతో భవిష్యత్తులో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా కార్యాచరణను రూపొందించాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది.
చంద్రబాబునాయుడు.. భాగస్వామ్య సదస్సుల పేరుతో.. విశాఖ తీరంలో పెట్టుబడుల సదస్సు నిర్వహించేవారు. దేశ విదేశాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలందర్నీ ఆహ్వానించేవారు. ఒప్పందాలు జరిగేవి. ఎక్కువ రాష్ట్రాలు.. అదే తరహాలో పార్టనర్ షిప్ సమ్మిట్లను నిర్వహించేవి. అయితే జగన్ మాత్రం.. వినూత్నంగా ఆలోచిస్తున్నారు. దౌత్యవేత్తలతో సమావేశం నిర్వహించి ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కొత్త ఆలోచనతో భారీగా పరిశ్రమలను ఏపీకి ఆకర్షిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.