జగన్మోహన్ రెడ్డి తదితరులపై సిబీఐ కోర్టులో అక్రమాస్తుల కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే ఈడి కూడా సిబీఐ దాఖలు చేసిన ఒక చార్జ్ షీట్ ఆధారంగానే జగన్, జగతి పబ్లికేషన్స్, విజయ సాయిరెడ్డిలపై మరొక కేసులు నమోదు చేసి సమాంతరంగా విచారణ మొదలుపెట్టడానికి సిద్దమయింది. దానిని వారు హైకోర్టులో సవాలు చేసారు. తమపై ఈడి నమోదు చేసిన ఆ కేసులని కూడా సిబీఐ కోర్టుకే బదిలీ చేయాలని వారు హైకోర్టుని కోరగా అందుకు ఈడి కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడంతో, జస్టిస్ రాజా ఇళాంగో ఆ కేసులను కూడా సిబీఐ కోర్టుకి బదిలీ చేశారు. జగన్ తదితరులపై ఈడి నమోదు చేసిన కేసులను వేరేగా విచారణ చేపట్టాలని సిబీఐ కోర్టుని ఆదేశించవలసిందని ఈడి చేసిన అభ్యర్ధనను న్యాయమూర్తి తిరస్కరించారు.
జగన్ అక్రమాస్తుల కేసులలో నిందితులు ఒకరొకరుగా బయటపడటం, ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక ఐ.ఏ.ఎస్. అధికారిని విచారించేందుకు కేంద్రం అనుమతి నిరాకరించడం, ప్రతీ శుక్రవారం తప్పనిసరిగా కోర్టుకి హాజరు కావాలనే బెయిల్ షరతుపై జగన్ కి మినహాయింపునివ్వడం, ఇప్పుడు ఈడి కేసులను కూడా సిబీఐకి బదిలీ చేయడం వంటివన్నీ పరిస్థితులు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారుతున్నట్లు సూచిస్తున్నాయి. చివరికి అవి ఏ రాజకీయ పరిణామాలకి దారి తీయబోతున్నాయో చూడాలి.