ఆస్తుల వివాదాన్ని ఇలా కొనసాగిస్తే ఎక్కడికి పోతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడటంతో ఏదో విధంగా పరిష్కరించుకోవాలన్న సలహాలు జగన్ కు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. తల్లి, చెల్లిపై కోర్టుకెళ్లడమే చాలా పెద్ద తప్పిదమని ఆ సలహా ఎవరు ఇచ్చారో కానీ అర్జంట్ గా వారు చెప్పినవి కాకుండా.. వివాదం పరిష్కారమయ్యే ఆలోచనలు చేయాలని ఆయనకు సూచనలు అందుతున్నాయి.
విషయాన్ని అంతకంతకూ పెద్దది చేసుకుని అతి మంచితనం అని పేపర్లో రాయించుకుంటే ఎవరూ వినరు. ట్రోల్ చేస్తారు. అదే విషయాన్ని జగన్ కు అర్థమయ్యేలా చెప్పడానికి పార్టీ నేతలు.. కుటుంబ సన్నిహితులు తంటాలు పడుతున్నారు. నిజానికి ఆయనకు ఇప్పుడు కుటుంబంలో అత్యంత సన్నిహితులు దూరంగా ఉన్నారు. వారెవరితోనూ జగన్ మాట్లాడటం లేదు. అవినాష్ వర్గం బంధువులే ఉన్నారు. వారు జగన్ ను మరింత రెచ్చగొడుతున్నారని వివాదాన్ని పరిష్కరించుకుండా ఉండేలా చూస్తున్నారని చెబుతున్నారు.
అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఏదో ఒకటి చేద్దామనే జగన్ పులివెందులకు వచ్చారని అంటున్నారు. ప్రెస్ మీట్ పెట్టి ఇక షర్మిళకు ఇవ్వాల్సినవి ఇచ్చేశాను.. ఆస్తుల వివాదాలేమీ లేవని చెప్పాలని అనుకున్నారని అంటున్నారు. అయితే విజయమ్మ లేఖ రాయడం.. అందులో ఏం జరిగిందో పూసగుచ్చినట్లుగా ప్రకటించడంతో .. ఇలాంటి సమయంలో తెగదెంపుల ప్రకటనలు చేస్తే మరింత డ్యామేజ్ అవుతుందని ఆగిపోయారని అంటున్నారు. మొత్తంగా జగన్ తీసుకునే నిర్ణయంతోనే వివాదం పెరుగుతుందా.. ముగుస్తుందా అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.