ఊహించినట్లే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈరోజు వైకాపాకి మళ్ళీ మరో ఎదురుదెబ్బ తగిలింది. ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగ్ జరపాలని కోరుతూ స్పీకర్ కోడెల శివప్రసాద రావుకి లేఖ వ్రాసి, ఆయన అందుకు అంగీకరిస్తారనే భ్రమతో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేసారు. ఆ విప్ ని తెదేపాలో చేరిన 10 మంది వైకాపా ఎమ్మెల్యేలు ధిక్కరిస్తే వారిపై అనర్హత వేటు వేయించవచ్చని జగన్ భావించారు. కానీ, జగన్ తలిచింది ఒకటయితే స్పీకర్ మరొకటి తలిచారు. జగన్మోహన్ రెడ్డికి మరొకమారు నిరాశ కలిగిస్తూ స్పీకర్ కోడెల ద్రవ్య వినిమయ బిల్లుపై మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేయించారు. తరువాత శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది.
తరువాత జగన్ శాసనసభ బయట ఉన్న మీడియాతో మాట్లాడుతూ “ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగ్ నిర్వహిస్తే తెదేపాలో చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయవలసి వస్తుందనే భయంతోనే మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు. అంటే నైతికంగా మేమే గెలిచామని స్పష్టం అవుతోంది. వాళ్ళచేత రాజీనామాలు చేయించి ప్రజలలోకి వెళ్ళే ధైర్యం చంద్రబాబు నాయుడుకి లేదు. అందుకనే వారిపై అనర్హత వేటు పడకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకొంటున్నారు. దిసీజ్ మోరల్ విక్టరీ ఫర్ అజ్. ఎఫ్.ఆర్.బి.బి.ఎం. చట్ట ప్రకారం రాష్ట్ర జిడిపికి 3శాతం మించి ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించడానికి వీలులేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 22,000 కోట్ల డిపాజిట్లు సేకరించింది. అది ముఖ్యమంత్రిని జైలుకి పంపదగ్గ నేరం. ప్రజల నుంచి సేకరించిన ఆ డబ్బుని పక్కదారి పట్టించడం వలన దానిని రాష్ట్ర బడ్జెట్ లో కూడా చూపలేదు. వివిధ పధకాలు, పనుల కోసం చేసిన ఖర్చులకి, ప్రభుత్వం చూపుతున్న లెక్కలలో చాలా వ్యత్యాసాలున్నాయి. అందుకే మేము ద్రవ్య వినిమయ బిల్లుని వ్యతిరేకించాము. దానిపై ఓటింగ్ జరగాలని ప్రధాన ప్రతిపక్షం కోరినప్పుడు నిబంధనల ప్రకారం ఆ అభ్యర్దనను స్పీకర్ అనుమతించవలసి ఉన్నప్పటికీ, ఆయన పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు ప్రజాస్వామ్యాన్ని తుంగలో త్రొక్కుతూ మూజువాణితో బిల్లును ఆమోదింపజేశారు. ఆయన తన స్పీకర్ స్థానాన్ని కూడా అగౌరవపరిచారు,” అని జగన్ అన్నారు.