ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికి జగన్ రెడ్డి కేసులు మూడు వేల సార్లను వాయిదా వేశారని.. ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయంపులు ఇచ్చారని.. డిశ్చార్జ్ పిటిషన్లు వందల సంఖ్యలో దాఖలు చేశారని.. విచారణలో విపరీతమైన జాప్యం జరుగుతున్నందున.. కేసులను ఇతర రాష్ట్రాలకు తరలించాలని రఘురామ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టిలతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు రానుంది. ప్రజాప్రతినిధులపై ఉన్న తీవ్రమైన అభియోగాల కేసుల్ని ఏడాదిలోగా తేల్చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందు కోసం ప్రత్యేక కోర్టుల ఏర్పాటు కోసం చొరవ తీసుకున్నారు. కానీ తర్వాత మళ్లీ మమూలు పరిస్థితి చేరింది. గతంలో ప్రతి శుక్రవారం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సీబీఐ కోర్టులో జరిగేది. ఈ మధ్య కాలంలో అలా కూడా జరగడం లేదు. ఈ క్రమంలో జగన్ కేసుల విచారణ ఆలస్యం అవుతోందని హైదరాబాద్ లో విచారణ అయితే సాగదని భావించి రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. గతంలో జగన్ మోహన్ రెడ్డి బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నరని … బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.
ఇందులో సాక్ష్యాలుగా.., అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న వారికి పలు రకాల పదవులు ఇవ్వడం.. ప్రయోజనాలు కల్పించడం వంటివి చేస్తున్నారని కోర్టుకు నివేదించారు. అయితే ఈ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టి వేసింది. తర్వాత ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఈ పిటిషన్ విచాణకు రావడం లేదు.