ఆంధ్రప్రదేశ్ లోని ప్రాజెక్టుల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ఎన్నికల ముందు తమపై ఆరోపణలు చేశారనీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అవినీతిని చూపిస్తే బహుమతులు ఇస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారన్నారు ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వ హయాంలో ప్రాధాన్యతా క్రమంలో పనులు తాము చేపట్టామన్నారు. ఆ పనుల్ని ఇప్పుడు ఆపేసి, వాటిలో ఏదో అవినీతి జరిగిందంటూ బురద చల్లడం సరికాదన్నారు. అవినీతి సమాచారం ఇస్తే సన్మానాలని ముఖ్యమంత్రి అంటున్నారు, దీన్ని ప్రజలు ఎలా చూడాలన్నారు చంద్రబాబు నాయుడు. అంటే, ఇప్పటివరకూ వారు చేస్తూ వచ్చిన ఆరోపణలన్నీ అసత్యాలని వారే ఒప్పుకున్నట్టు కాదా అన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం కారణంగా ఇప్పటికే రైతులు సీజన్ కోల్పోవాల్సి వచ్చిందన్నారు చంద్రబాబు. కేంద్రం నుంచి రావాల్సిన రూ. 4 వేల కోట్ల కోసం ప్రభుత్వం వెంటనే డిమాండ్ చేయాలన్నారు. పోలవరం నిర్మాణ పనుల్ని కేంద్రమే ఇకపై చూసుకుంటుందని అన్నారనీ, ఇప్పుడు మళ్లీ తామే చేస్తామని ముఖ్యమంత్రి అంటున్నారని పేర్కొన్నారు. రైతు రుణమాఫీలో భాగంగా విడుదల చేయాల్సిన నాలుగు, ఐదో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని ప్రాజెక్టుల నిర్మాణాలను ఏకపక్షంగా నిలపేస్తామని ప్రభుత్వం అంటుండటం సరికాదన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు కూడా నిలిపేసే పరిస్థితిని తీసుకొస్తున్నారంటూ విమర్శించారు.
టీడీపీలో ఓటమికి సంబంధించిన సమీక్షలు, విశ్లేషణలు ఒక కొలీక్కి వచ్చేసినట్టు సమాచారం. జగన్ సర్కారు నిర్ణయాలపై ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించడాన్ని చంద్రబాబు నాయుడు మొదలుపెట్టారనే అనిపిస్తోంది. ప్రాజెక్టులు, రైతు రుణమాఫీ అంశాలపై తాజాగా విమర్శలు చేశారు. దీంతోపాటు రాజధాని అమరావతి నిర్మాణాంశాన్ని కూడా ప్రధానంగా చేసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అభివృద్ధి పనులు ఆపొద్దని కూడా సూచిస్తున్నారు. మరి, ప్రతిపక్ష పార్టీ నాయకుడు చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ ఇప్పుడే స్పందిస్తారా… అసెంబ్లీ సమావేశాల ప్రారంభం తరువాత విపక్ష విమర్శలకు సమాధానాలు చెబుతారా అనేది వేచి చూడాలి.