తెలుగు మీడియంను ఎత్తేయాలన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన పవన్ కల్యాణ్‌పై.. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆయనకు ముగ్గురు భార్యలు.. ఐదుగురు పిల్లలని..వారంతా ఏ మీడియంలో చదువుతున్నారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ గురించి స్పందించాల్సి వస్తే.. జగన్మోహన్ రెడ్డి కేవలం.. ఆయన భార్యల ప్రస్తావన మాత్రమే తెస్తున్నారు. ఎన్నికలకు ముందు కూడా .. ఓ సారి కూడా.. ఇలాంటి విమర్శలే చేశారు. అప్పుడు.. జనసైనికులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ కుటుంబ విషయాలను తెరపైకి తీసుకు వచ్చి.. రచ్చ చేశారు. తిట్లు వర్సెస్ బూతులు అన్నట్లు.. వైసీపీ, జనసేన సోషల్ మీడియా వార్ సాగింది. అప్పుడు వ్యూహాత్మకంగానే జగన్మోహన్ రెడ్డి పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేశారని… అప్పటి వరకూ ఉన్న టాపిక్‌లను డైవర్ట్ చేశారన్న అభిప్రాయం వ్యక్తమయింది.
ఇప్పుడు కూడా.. జగన్మోహన్ రెడ్డి అదే పని చేస్తున్నారని.. .అందుకే.. పవన్ కల్యాణ్ ను మరోసారి వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని.. జనసేన ఓ నిర్ణయానికి వచ్చింది. ఇసుక సమస్యపై పవన్ కల్యాణ్ పోరాడుతున్నారు. విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించి రెండు వారాల గడువు ఇచ్చారు. ఈ క్రమంలో.. భారీ పోరాట ప్రణాళికలకు.. జనసేన సిద్ధం అవుతోంది. ఈ విషయం నుంచి దృష్టి మళ్లించడానికే జగన్మోహన్ రెడ్డి.. వ్యక్తిగత విమర్శలకు దిగారని.. జనసేన ఓ నిర్ణయానికి వచ్చింది. వెంటనే అలర్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలపై ఎవరూ స్పందించవద్దని.. ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్.. పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇది టాపిక్ డైవర్ట్ చేయడానికేనని.. ఆయన స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడు కావడానికన్నా ముందు సినిమా యాక్టర్. ఆయనకు యూత్ లో క్రేజ్ ఉంది. ఆయన ఫ్యాన్స్ గుడ్డిగా.. దూసుకెళ్తారన్న అభిప్రాయం ఉంది. వారిని ఒక్క సారి రెచ్చగొడితే… అసలు సమస్య నుంచి డైవర్ట్ అయిపోతుందన్న వ్యూహాన్ని .. వైసీపీ అమలు చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఇసుక కొరత విషయంలో ఇప్పటికే వరుస ఆత్మహత్యలు… కూలీలకు ఉపాధి లేకపోవడం.. సమస్యగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకట్ట వేయడానికి జగన్… పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసినట్లుగా దాదాపుగా ఓ అంచనాకు వచ్చారు.