కోర్టు తీర్పులు తమకు అనుకూలంగా వస్తే న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నవాటి పట్ల తమకు అపారమయిన నమ్మకం,గౌరవం ఉన్నాయని చెప్పుకొనే రాజకీయ పార్టీలు, వ్యతిరేకంగా వస్తే కోర్టులను తప్పు పడుతుంటాయి. న్యాయస్థానాలను మేనేజ్ చేసి అనుకూలంగా తీర్పులు తెప్పించుకొంటారని జగన్ వంటివారు ఆరోపణలు చేస్తుంటారు. రోజా కేసు విషయంలో తెదేపా, వైకాపాల ప్రతిస్పందనలు చూసినట్లయితే కోర్టుల పట్ల వాటికి ఎటువంటి అభిప్రాయాలున్నాయో అర్ధం చేసుకోవచ్చును.
ఈరోజు హైకోర్టు ద్విస్వభ్య ధర్మాసనం రోజా కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టడంతో, తెదేపా ఆ తీర్పును స్వాగతించగా, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి “ఆ తీర్పుపై నేను ఎటువంటి వ్యాక్యలు చేయదలచుకోలేదు. ఈ కేసులో న్యాయపోరాటం కొనసాగించాలనుకొంటున్నాము,” అని చెప్పారు. అంటే ఆయన హైకోర్టు తీర్పుతో ఏకీభవించడం లేదని స్పష్టమవుతోంది. అదే విషయం బయటి చెపితే మళ్ళీ అదో వివాదం అవుతుంది కనుక ఆ తీర్పుపై వ్యాక్యలు చేయదలచుకోలేదని క్లుప్తంగా చెప్పారనుకోవలసి ఉంటుంది.
తెదేపా ప్రభుత్వం, స్పీకర్ కోడెల శివప్రసాద రావు రోజా క్షమాపణలు చెప్పుకొనేమాటయితే, ఇక్కడితో ఈ వివాదాన్ని ముగిద్దామన్నట్లు చెపుతునప్పుడు, జగన్ ఇంకా న్యాయపోరాటానికి చేయాలనుకొంటే, ఆయన ఈ వివాదం ఎంతకాలం కొనసాగితే అంత మంచిదని భావిస్తున్నారని అనుమానించవలసి ఉంటుంది. దాని వలన రోజాకి కానీ, వైకాపాకి గానీ ఎటువంటి రాజకీయ ప్రయోజనం ఉండదని చెప్పవచ్చును. ఆయన తీరు పట్ల పార్టీలో కూడా ఇప్పటికే చాలా మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా పార్టీలో అసంతృప్తి ఇంకా పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇంకా తను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళని వాదిస్తే చివరికి ఆయనే నలుగురిలో నవ్వులపాలవుతారు.