అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవ్వక ముందు నుంచీ కూడా మిర్చి రైతుల కష్టాలు మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. ఆ సమావేశాల టైంలోనే గుంటూరు మిర్చి యార్డుకు వెళ్ళి రైతుల కష్టాలను కళ్ళారా చూశాడు జగన్. అప్పటికప్పడు దీక్షకు దిగితే వైకాపా పార్టీకి చెందిన దళారీలకు కోపం వస్తుంది కాబట్టి….ఆ తర్వాత కూడా చాలా కాలం వెయిట్ చేసి చివరిదశలో రెండు రోజుల దీక్ష అని చెప్పి ఒకటిన్నర రోజులకు నిమ్మరసం తాగేసి మమ అనిపించాడు. దీక్ష సమయంలో కూడా మిర్చి రైతుల కష్టాలకంటే కూడా లోకేష్, చంద్రబాబులపై జగన్ చేసిన విమర్శలే హైలైట్ అయ్యాయి. అంతోటి దీక్షతో జగన్‌కి ఎక్కడ మైలేజ్ వస్తుందో అని చెప్పి అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్వారు రైతులకు అనుకూలంగా ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారంలో చంద్రబాబు ఉండాలి. ప్రభుత్వ వ్యతిరేకత అంతా పవన్‌కి ప్లస్ అవ్వాలి అని వ్యూహం రచిస్తున్న బాబు భజన మీడియా ఇద్దరికీ సమానంగా కవరేజ్ ఇచ్చింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మిర్చి రైతుల సమస్య తీవ్రమవుతూ ఉండడం, మిర్చి ‘మంటలు’ తారాస్థాయికి చేరుకుంటూ ఉండడంతో బాబు రుణమాఫీ మేజిక్ స్టైల్లో మిర్చి రైతుల కష్టాలు తీరుస్తున్నాం అని చెప్పి కేంద్రం ఒక ప్రకటన చేసింది. ఇక ఆ వెంటనే బాబు భజన మీడియా రెడీ అయిపోయింది. అంతోటి తూతూ మంత్రపు ప్రకటన తాలూకూ క్రెడిట్ ఎక్కడ జగన్‌కి కూడా పోతుందేమోనని భయపడి….వెంకయ్య 24గంటలూ కష్టపడి మిర్చి రైతుల కష్టాలు తీర్చాడు, కేంద్రం మిర్చి రైతుల కన్నీరు తుడవడంలో చంద్రబాబు పడ్డ 36గంటల కష్టం ఉంది అనే స్థాయిలో వార్తలు వండివార్చారు. అధికారంలో ఉన్నవాళ్ళు ఇచ్చే తాయిలాలు, రాయితీలతో పండగ చేసుకుంటున్న భజన మీడియా, అధికార పార్టీల దళారీలు సంతోష పడిన స్థాయిలో అయితే రైతుల్లో సంతోషం కనిపించలేదు. పైగా ఆ మరుసటి రోజు రాస్తారోకోలు కూడా మొదలెట్టారు. అఫ్కోర్స్ అలాంటి వార్తలు జనాలకు చేరకుండా మన భజన మీడియా జాగ్రత్తపడిందనుకోండి.
జగన్ రైతు దీక్ష తరువాత నుంచీ ఇన్ని పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ జగన్ ఒక్కసారి కూడా స్పందించింది లేదు. ఒకటిన్నర రోజు దీక్ష దెబ్బకు సొమ్మసిల్లి రెస్ట్ తీసుకుంటున్నాడేమో తెలియదు. రైతుల కష్టాలు, ఆందోళనలను వీలైనంత తక్కువ చేసి చూపించి మాయ చేసే ప్రయత్నంలో ప్రభుత్వాలు, భజన మీడియా ఉన్నప్పుడు ఆ సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ పోరాడాల్సిన అవసరం జగన్‌కి లేదా? ఒకటిన్నర రోజు దీక్ష జగన్ డైటింగ్‌కి ఏమైనా ఉపయోగపడిందేమో కానీ రైతులకు ఒరిగిందేంటి? ఇంతకంటే తీవ్రమైన సమస్యలు రాష్ట్రంలో ఏం ఉన్నాయి? మిర్చి రైతుల కష్టాలు రెండు నెలల నుంచీ ప్రతి రోజూ కంటికి కనిపిస్తున్నా దళారీలకు కొమ్ముకాస్తూ రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం స్పందించే స్థాయిలో జగన్ దీక్ష చేపట్టలేడా? పోరాటం చేయలేడా? అలా అయితే ట్విట్టర్ రాజకీయం చేస్తున్న పవన్‌కి జగన్‌కి తేడా ఏముంది? ఒకవేళ జగన్ దీక్ష…పవన్ ట్విట్టర్ ప్రకటన కాస్త బెటరే కదా అని వైకాపా నేతలు వాదించినా……ఆ దీక్షతో మిర్చి రైతులకు ఏమీ ప్రయోజనం లేనప్పుడు జగన్ దీక్ష చేస్తే ఎంత? చెయ్యకపోతే ఎంత?