వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలోకి తీసుకుపోతుండటంతో అప్రమత్తమయిన ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాజధాని భూముల బినామీ కొనుగోళ్ళ వ్యవహారాన్ని బయటపెట్టారు. అదే సమయంలో ముద్రగడను కూడా మళ్ళీ తెదేపా ప్రభుత్వంపైకి ఉసిగొల్పినట్లున్నారు. దానితో ఆయన కూడా ప్రభుత్వంతో యుద్ధం మొదలుపెట్టేసారు. ఒకేసారి జగన్, ముద్రగడ ఇద్దరూ కలిసి చేస్తున్న ఈ దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెదేపా ప్రభుత్వం వైకాపా ఎమ్మెల్యేల విషయంలో తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్లుంది. కనుక జగన్ వ్యూహం ఫలించినట్లే కనబడింది కానీ ఈరోజే పాతపట్నం వైకాపా ఎమ్మెల్యే కలమట వెంకట రమణ తన తండ్రి మాజీ ఎమ్మెల్యే మోహన్ రావుతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇవ్వాళ్ళ తెదేపాలో చేరిపోయారు.
ముద్రగడ పద్మనాభం ప్రభుత్వానికి మార్చి 10వరకు గడువు విధించారు. అంటే ఇంకా ఆరు రోజుల వ్యవధి ఉంది. కనుక ఈలోగా ఎవరూ పార్టీ వీడకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి తెదేపా ప్రభుత్వంపై ఏదోవిధంగా ఇంకా ఒత్తిడి పెంచవచ్చును. బహుశః ఈలోగా అమరావతి ప్రాంతంలో బినామీ పేర్లతో భూములు కొన్న మరికొంత మంది తెదేపా నేతల పేర్లు సాక్షి మీడియా బయటపెడుతుందేమో?
రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలవుతాయి కనుక వాటిని దీని కోసం ఉపయోగించుకొంటూ జగన్, అతని పార్టీ ఎమ్మెల్యేలు చెలరేగిపోవచ్చును. స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై, తెదేపా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని ఎలాగూ ముందే ప్రకటించారు కనుక దానితో కూడా సభలో రభస చేయవచ్చును. తెదేపా ప్రభుత్వం కేవలం వైకాపా నుండే కాకుండా మిత్రపక్షమయిన బీజేపీతో కూడా చాలా ఇబ్బంది పడుతోంది. కనుక ఈ ఒత్తిళ్ళ కారణంగా తెదేపా వెనక్కి తగ్గినట్లయితే జగన్ వ్యూహం పూర్తిగా ఫలించినట్లే చెప్పవచ్చును.