2019లో వైసీపీ సాధించిన ఘన విజయాన్ని సైతం జగన్ రెడ్డి అపహాస్యం చేశారు. ఈవీఎంలపై సందేహలు వ్యక్తం చేస్తూ తాజాగా జగన్ చేసిన ట్వీట్ గతంలో వైసీపీ విక్టరీపై అనుమానాలను పెంచేందుకు కారణం అయింది. జగన్ ప్రకటన ఓ రకంగా నాటి విజయం దొడ్డిదారిన వచ్చింది అనే విమర్శలకు ఆజ్యం పోసేలా ఉంది.
ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారని… ప్రజాసామ్య స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా వాటిని వాడాలంటూ జగన్ ట్వీట్ చర్చనీయాంశం అవుతోంది. 2019లో వైసీపీ ఘన విజయం సాధించినప్పుడు ఈవీఎంలపై అనుమానాలను వ్యక్తమైతే వాటిని కొట్టిపారేసిన జగన్ రెడ్డి…ఈ ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయం పాలయ్యేసరికి ఈవీఎంలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాంతం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. పేపర్ బ్యాలెట్ల ద్వారా ఎన్నికలను నిర్వహించాలని దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలు డిమాండ్ చేసినా కనీసం కోరస్ ఇవ్వని జగన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత విపక్షాల స్వరానికి జత కలవడం విశేషం.
ఈవీఎంల పట్ల జగన్ రెడ్డి చేసిన ట్వీట్ పై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈవీఎంలు ప్రజా తీర్పును ప్రతిబింబించలేవని జగన్ అంటున్నారంటే.. 2019లో వైసీపీ విజయాన్ని సైతం అనుమానిస్తున్నట్టే. అవమానిస్తున్నట్టే. ఇప్పుడు ఇదే అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి 2019లోనూ ఈవీఎంల లోపంతోనే వైసీపీ రికార్డ్ మెజార్టీతో విజయం సాధించిందా..? అని జగన్ రెడ్డి ట్వీట్ కు కౌంటర్ ఇస్తున్నారు.