సెట్లో దర్శకుడికీ, నటీనటులకు మధ్య కెమిస్ట్రీ చాలా అవసరం. డైరెక్టర్ ఏం చెబుతున్నాడది ఆర్టిస్టులకు, ఆర్టిస్టులతో పెర్ఫార్మెన్స్ ఎలా తీసుకురావాలన్నది దర్శకులకు తెలియాల్సిందే. ఈ రెండింటో ఏది లేకపోయినా, మిస్ కమ్యునికేషన్ జరుగుతుంది. దాంతో సెట్లో అంతా గందరగోళమే. ఇలాంటి ఓ సందర్భమే.. ‘ఫ్యామిలీస్టార్’ సినిమా సెట్లో ఎదురైంది.
ఈ సినిమాలో జగపతిబాబు ఓ చిన్న పాత్ర పోషించారు. ఆయన కనిపించింది రెండు మూడు సీన్లే. అయితే ఓ సీన్ కోసం ఏకంగా 47 టేకులు తీసుకొన్నారన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. జగపతిబాబు పెద్దగా టేకులు తినేసి, ఇబ్బంది పెట్టే నటుడు కాదు. మెథడ్ యాక్టింగ్ అస్సలు తెలీదు. ఒకటి, రెండు టేకుల్లో సీన్ పూర్తయిపోతుంది. కానీ తన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా 47 టేకులు తీసుకోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. అలాగని అదేదో.. అరివీరభయంకరమైన పెర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న సీన్కాదు. చాలా మామూలు సీనే. అయినా ఇన్ని టేకులు ఎందుకు అవసరం అయ్యాయి?
ఎందుకంటే.. ఇదంతా జగపతి బాబు దర్శకుడిపై తీర్చుకొన్న స్వీట్ రివైంజ్. సెట్లో సీన్‌కి సంబంధించిన ఏదో డౌట్ ఉంటే, పరశురామ్‌తో చర్చిస్తున్నప్పుడు ఆయనేదో వెటకారంగా మాట్లాడారట. దాంతో.. జగ్గూభాయ్‌కి కోపం వచ్చింది. అదంతా.. టేకులు తినేస్తూ తీర్చేసుకొన్నారు. పావుగంటలో పూర్తవ్వాల్సిన షాట్… ఒక్క పూటకు గానీ పూర్తవ్వలేదు. కక్కలేక మింగలేక.. పరశురామ్ మోనేటర్ ముందు కూర్చుని ‘వన్ మోర్’ చెప్పుకొంటూ వెళ్లిపోయాడు. చివరికి జగ్గూభాయ్‌కే విసుగొచ్చి, ఆ సీన్ పర్ఫెక్ట్గా చేసేసి, తప్పుకొన్నారు. సీనియర్ ఆర్టిస్టులతో పెట్టుకొంటే, ఇలానే ఉంటుంది మరి.