విలన్ పాత్రలతో ఓ ఊపు ఊపేస్తున్నాడు జగపతిబాబు. తాజాగా ‘అరవింద సమేత వీర రాఘవ’లో మరోసారి తన నట విన్యాసం చూపించాడు. కళ్లలో క్రూరత్వాన్ని పలికించి – బసి రెడ్డి పాత్రని నిలబెట్టాడు. జగ్గూభాయ్ దృష్టి ఇప్పుడు మిగిలిన భాషా చిత్రాలపై పడింది. తమిళ, కన్నడ చిత్రాలు కొన్ని ఒప్పుకున్న జగ్గూ… బాలీవుడ్‌లోనూ ఓ సినిమా చేస్తున్నాడు. తెలుగులో తన చేతిలో ఉన్న సినిమాల్లో `సైరా` ముఖ్యమైనది. ఈ సినిమా గురించి తొలిసారి పెదవి విప్పాడు జగపతిబాబు.
”ఇప్పటి వరకూ నేను చేసిన పాత్రల్లో `సైరా` విభిన్నమైనది. నా గెటప్ కూడా ఊహించని విధంగా ఉంటుంది. ఈ పాత్ర ఓ రకంగా నాకు ఛాలెంజ్. ఈ పాత్ర ఏమిటన్నది ఇప్పుడే చెప్పను. దానికి చాలా సమయం ఉంది. రామ్ చరణ్ ఓ కథానాయకుడిగా ఉంటూనే, నిర్మాణ బాధ్యతల్ని నెత్తిమీద పెట్టుకున్నాడు. తన తపన చూస్తే ఆనందంగా ఉంది” అంటూ చరణ్‌కి కూడా కితాబిచ్చాడు జగ్గూభాయ్. నిజానికి ‘ఖైది నెం.150’లో జగపతిబాబు నటించాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర కోసం మరొకర్ని తీసుకున్నారు. ఈసారి మాత్రం జగ్గూ ఈ ఛాన్స్ అందిపుచ్చుకున్నాడు.