సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోలుగా ఒక వెలుగు వెలుగుతున్నవారు ఎప్పటికీ హీరో వేషాలే వేస్తూ తమ మనుమరాలి వయసున్న హీరోయిన్లతో రోమాన్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించాలని ప్రయత్నిస్తూ నవ్వుల పాలవుతుంటారు. కానీ చాలా కొద్ది మంది సీనియర్ హీరోలు తమ వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకొని చేస్తూ, జీవించి ఉన్నంతవరకు సినిమాలలో నటిస్తూ అందరి మన్ననలు పొందుతుంటారు. అటువంటి వారిలో ఒకప్పటి దసరా బుల్లోడు అక్కినేని నాగేశ్వర రావు, ఇప్పటి సినీ కురువృద్ధుడు అమితాబ్ బచ్చన్ వంటివారు అనేక మంది ఉన్నారు. జగపతిబాబు కూడా వారిలో ఒకడిగా ఎదుగుతున్నారు.
ఆయన మొదటి ఇన్నింగ్స్ లో హీరోగా చాలా సూపర్ హిట్ చిత్రాలు అందించారు. తరువాత కుర్ర హీరోలు రంగప్రవేశం చేయడంతో ఆయనకి క్రమంగా అవకాశాలు తగ్గడం మొదలయ్యాయి. అయినా నిరాశ చెందకుండా తన వయసుకి తగిన పాత్రలు, విలన్ పాత్రలు చేయడానికి సిద్దపడటంతో ఆయన సినీ జీవితంలో రెండవ ఇన్నింగ్స్ విజయవంతంగా సాగిపోతోంది.
త్వరలో ఆయన భరతన్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ విజయ్ తో కలిసి తమిళ సినిమాలో నటించబోతున్నారు. ఆ సినిమా పేరు ‘ఖాన్’ అని తెలుస్తోంది. ఆ సినిమా షూటింగ్ ఈ ఏడాది మే నెల నుండి మొదలవుతుంది. ఆ సినిమా కాకుండా ప్రముఖ మళయాళ సినీ నటుడు మోహాన్ లాల్ తో కలిసి ఒక మళయాళ సినిమాలో కూడా జగపతి బాబు నటించబోతున్నారు. ఆ సినిమాకి ‘పులి మురుగన్’ అని పేరు పెట్టారు. 1989లో సింహ స్వప్నం అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా అడుగుపెట్టిన జగపతి బాబు ఇంతవరకు తెలుగు, తమిళ, కన్నడ బాషలతో కలిపి మొత్తం 111 సినిమాలు నటించేరు. త్వరలో ఆ జాభితాకి మరో సినిమాలు జోడించబడతాయి. ఆయన ఇదే జోరు కొనసాగించగలిగితే బహుశః డబుల్ సెంచరీ పూర్తి చేయడం ఖాయం.