మరపురాని చిత్రాల నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ తనయుడైన జగపతిబాబు హీరోగా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా తన చిత్రాల ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యాడు. హీరోగా అవకాశాలు తగ్గిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇటీవల ‘శ్రీమంతుడు’ చిత్రంలో మహేష్ తండ్రిగా, నిన్న లెజెండ్ లేటెస్ట్గా ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో ఒక డిగ్నిఫైడ్ విలన్‌గా, చక్కని నటనను ప్రదర్శించిన జగపతిబాబు ఇప్పుడు మరో అవతారంలో కనిపించబోతున్నాడు.
జగపతి పిక్చర్స్ బేనర్‌ను జగపతిబాబు పేరుతో స్టార్ట్ చేసి ఎన్నో సూపర్ డూపర్‌హిట్ సినిమాలను నిర్మించారు వి.బి.రాజేంద్రప్రసాద్. చాలా కాలం క్రితమే ఈ బేనర్లో చిత్ర నిర్మాణాన్ని ఆపేశారు. ఇప్పుడు తండ్రి తర్వాత జగపతిబాబు నిర్మాతగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. క్లిక్ సినీ కార్డ్ మీడియా ప్రై. లిమిటెడ్ పేరుతో ఓ చిత్ర నిర్మాణ సంస్థని ప్రారంభిస్తున్నాడు. ఈ బేనర్లో సంవత్సరానికి నాలుగు సినిమాలను నిర్మించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. నూతన నటీనటులకు, కొత్త దర్శకులకు, కొత్త టెక్నీషియన్స్‌కి తన బేనర్లో అవకాశాలు ఇచ్చి మంచి సినిమాలు నిర్మించాలన్నది జగపతిబాబు ఆలోచన. అతని పుట్టినరోజు ఫిబ్రవరి 12. ఆ రోజున తను స్టార్ట్ చేస్తున్న ప్రొడక్షన్ హౌస్ గురించి, నిర్మాతగా తన ఎంట్రీ గురించి జగపతిబాబు ప్రకటిస్తారని తెలుస్తోంది.