హీరోగా ఖేల్ ఖతం – దుకాన్ బంద్ అనుకొన్నప్పుడు… విలన్‌గా టర్న్ అయి అద్భుతమైన స్టెప్ వేశాడు జగపతిబాబు. హీరోగా ఎంత వెనకేశాడో తెలీదు గానీ… లెజెండ్ నుంచి ఇప్పటి వరకూ క్యారెక్టర్ పాత్రలు చేస్తూ, బాగానే సంపాదించాడు. డబ్బు సంగతి అలా ఉంచితే… తన ఖాతాలో హిట్లు పడ్డాయి. ఇండ్రస్ట్రీకి విలన్ పాత్ర కోసం సరికొత్త ఆప్షన్ దొరికినట్టైంది. ఈమధ్యలో జగపతిబాబుకి చాలాసార్లు హీరోగా ఛాన్సులొచ్చాయి. కానీ.. ఈ టైమ్ లో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక.. ఆయా కథల్ని, ఆఫర్లని పక్కన పెట్టాడు. అలాంటి జగపతిబాబు ‘పటేల్ సార్’ కథని ఓకే చేశాడంటే… కచ్చితంగా అందులో గొప్ప విషయమేదో ఉండే ఉంటుందనుకొంటాం. దానికి తగ్గట్టు ”ఈ సినిమా హిట్ అని అంటే.. నిరాశ పడతా. ఎందుకంటే సూపర్ హిట్ కావల్సిన సినిమా ఇది” అంటూ చాలా గొప్పగా మాట్లాడాడు.
దాంతో.. పటేల్ సార్‌ని అంతెత్తున ఊహించుకొని థియేటర్లకు వెళ్లారు. తీరా చూస్తే.. రొటీన్ రివైంజ్ డ్రామాని వండేసి, వడ్డించారు. సినిమాలో అక్కడక్కడ తప్ప… ఒక్క చోట కూడా దర్శకుడి ప్రతిభ, కొత్తదనం మచ్చుకైనా కనిపించలేదు. ”ఈ సినిమాని జగ్గూభాయ్ ఎందుకు ఎంచుకొన్నాడా… ఈసినిమా గురించి ఎందుకు ఇంత అతిగా ఐహించుకొన్నాడా” అనే అనుమానాలు ఏర్పడ్డాయి. ఫ్లాప్ సినిమాలు చేయడం నేరం కాదు, కెరీర్ అక్కడితో అంతం అయిపోయినట్టు కాదు. జగపతిబాబుకి ఫ్లాపులూ కొత్త కాదు. కానీ.. ఓ సినిమా గురించి ఈ స్థాయిలో డబ్బా కొట్టడం ఇదే ప్రధమం. అలాంటప్పుడు సినిమా ఎలా ఉండాలి?? తీరా చూస్తే పటేల్ సార్ ఒప్పుకొని జగ్గూభాయ్ భీకరమైన తప్పు చేశాడనిపిస్తుంది.
విలన్‌గా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ”నాలో హీరో మెటిరియల్ ఇంకా అలానే ఉంది” అని గుర్తు చేసే ప్రయత్నం చేయడం ఎందుకు?? ‘పటేల్ సార్’ తన కెరీర్ కి ప్లస్ అవుతుందని భావించిన జగ్గూభాయ్‌కి బాక్సాఫీసు గట్టి దెబ్బే కొట్టింది. ఈ సినిమా ప్లస్ కావడం మాట అటుంచితే.. విలన్ గా జగ్గూభాయ్ కెరీర్‌కి ఎలాంటి డామేజ్ చేయకుండా ఉండగలిగితే అదే పది వేలు.