సినిమా నిర్మాణం ఇప్పుడంత ఈజీ కాదు. దాని చుట్టూ బోల్డన్ని లెక్కలు దాగున్నాయి. సినిమా బాగా ఆడినా.. నిర్మాత చేతికి డబ్బులు రావడం లేదు. వార్తల్లో హిట్గా నిలిచిన సినిమాలు… లెక్కల్లోకి వచ్చేసరికి నష్టాలే చూపిస్తున్నాయి. ఈ దశలో బడా నిర్మాతలు సైతం చిత్ర నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. అయితే మన జగ్గూభాయ్.. జగపతిబాబు మాత్రం ఇప్పుడు సినిమాలు తీస్తానంటూ ముందుకొస్తున్నారు. త్వరలో రెండు సినిమాల్ని ప్రారంభిస్తాడట. అదీ కొత్తవాళ్లతో.
”సినిమా వ్యాపారం నాకు చేతకాదు.. అందుకే ప్రొడక్షన్లో వేలు పెట్టను” అని చాలా సార్లు చెప్పాడు జగపతిబాబు. నాన్న విబి రాజేంద్రప్రసాద్ నిర్మాణ సంస్థ గురించీ, ఆయన నిర్మాణ విలువల గురించీ తెలుగు సినిమా పరిశ్రమకు తెలియంది కాదు. అయితే నాన్న స్థాపించిన జగపతి పిక్చర్స్ వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయలేదు జగపతి. హీరోగా బిజీగా ఉన్నప్పుడు కూడా.. నిర్మాత అవ్వాలన్న ఆలోచన రాలేదు. ఈలోగా ఆర్థికంగా బాగా చితికిపోయాడు జగపతి. అప్పుల్లో కూరుకుపోయి.. సొంత ఇంటినే అమ్ముకొన్నాడు. ఇప్పుడు మెల్లిమెల్లిగా సెటిల్ అవుతున్నాడు. విలన్ పాత్రల ద్వారా కొద్దో గొప్పో సంపాదించుకొంటున్నాడు. ఆర్థికంగా సెటిల్ అవుతున్న ఈ దశలో మళ్లీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం రిస్క్ ఫ్యాక్టరే. అదీ కొత్త వాళ్లతో సినిమా అన్నది ఎప్పుడూ రిస్కే. మరి తెలిసి తెలిసీ… జగపతి ఈ ఊబిలోకి ఎందుకు దిగుతున్ననాడో?? ఎనీవే.. నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్లో జోరుమీదున్న జగపతి.. నిర్మాతగానూ విజయాన్ని అందుకోవాలని కోరుకొందాం.