కుటుంబకథా చిత్రాల నాయకుడిగా ఓ వెలుగు వెలిగిన జగపతిబాబుని ప్రతినాయకుడి పాత్రలో చూస్తామని ఎవరైనా ఊహించారా? లేదు! కానీ, కథానాయకుడి నుంచి ప్రతినాయకుడిగా మారిన తరవాత జగపతిబాబు పేరుప్రఖ్యాతలు మరింత పెరిగాయి. ప్రతినాయకుడి నుంచి సహాయ నటుడిగా మారాక… తండ్రి పాత్రల్లోనూ మెప్పించారు. ఇప్పుడు మరో కొత్త అవతారంలో ప్రేక్షకులకు కనిపించడానికి ఆయన సిద్ధం అవుతున్నారని సమాచారం. తెర వెనుక తండ్రి పాత్ర పోషించడానికి జగపతిబాబు రంగం సిద్ధం చేసుకుంటున్నార్ట! ప్రతి చిత్రానికి తండ్రి నిర్మాతలాంటివాడు అంటుంటారు. ఆ తండ్రిగా త్వరలో జగపతిబాబు ప్రేక్షకులు ముందుకు వస్తార్ట! ప్రస్తుతం వెబ్ సిరీస్ నిర్మించాలనే ఆలోచనలో ఆయన వున్నారని సమాచారం. జగపతిబాబు తండ్రి వి.బి. రాజేంద్రప్రసాద్ దర్శకుడిగా, నిర్మాతగా తెలుగులో ఎన్టీఆర్, అక్కినేని తదితర అగ్ర కథానాయకులతో చిత్రాలు చేశారు. అయితే… జగపతిబాబు మాత్రం నిర్మాణంవైపు ఇప్పటివరకూ దృష్టి సారించలేదు. ఆ ఆలోచన కూడా లేదని చెప్పేవారు. ఇన్నాళ్లకు నిర్మాణంలోకి అడుగు పెడుతున్నారన్న మాట!!