జగపతిబాబు కీర్తి ఎల్లలు దాటుతోంది. ప్రతినాయకుడిగా కొత్త ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి దర్శక రచయితలు ఆయన్ను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త పాత్రలు రాస్తున్నారు. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, కన్నడ, హిందీ దర్శక రచయితలూ ఆయన్ను తమ సినిమాల్లోకి తీసుకుంటున్నారు. ‘లింగ’తో తమిళ తెరకు ప్రతినాయకుడిగా పరిచయమైన జగపతిబాబు… తరవాత విశాల్ ‘ఒక్కడొచ్చాడు’, విజయ్ ‘భైరవ’ సినిమాల్లో నటించారు. తాజాగా తమిళంలో జగపతిబాబు కొత్త సినిమా అంగీకరించారు. అందులో ఆయన హీరోగా నటించనున్నారని సమాచారం. మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో మన జగపతిబాబుతో పాటు తమిళ హీరో ‘యాక్షన్ కింగ్’ అర్జున్, హిందీ నటుడు జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ ముగ్గురూ కాకుండా మరో మెయిన్ హీరో సినిమాలో వుంటాడట. అతడు ఎవరనేది దర్శక నిర్మాతలు సస్పెన్స్‌లో పెట్టారు. కొత్త కుర్రాడు అన్బరసన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. వినాయక చవితికి సినిమా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం వుంది. జగపతిబాబు, అర్జున్ మంచి స్నేహితులు. గతంలో వీళ్ళిద్దరూ హీరోలుగా ‘హనుమాన్ జంక్షన్’ సినిమా చేశారు.