జగతి పబ్లికేషన్స్ కేసులో జగన్మోహన్ రెడ్డి కోర్టులో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లలో ఆయన తరపు న్యాయవాదుల వాదన… వైసీపీలోనే సంభ్రమాశ్చర్యాలకు కారణం అవుతోంది. అసలు ఆ కేసులో తనకు సంబంధమే లేదని.. మొత్తం విజయసాయిరెడ్డినే చేశారన్నట్లుగా జగన్ తరపు న్యాయవాదులు వాదిస్తూండటమే దీనికి కారణం. జగతి పబ్లికేషన్స్ కేసులో దండమూడి అవినీంద్రకుమార్, మాధవ్ రామచంద్ర, టీఆర్ కన్నన్ అనే వ్యక్తులు 2007-2009 మధ్య రూ. 35 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టారు. షెర్ వాల్యూను.. డెలాయిట్‌తో కలిసి అక్రమంగా పెంచి.. చూపించి తమకు ఒక్కో షేర్‌ను విజయసాయిరెడ్డి రూ. 350కు అమ్మి మోసం చేశారని వారు ఫిర్యాదు చేశారు.
ఇప్పటి వరకూ తమకు పైసా కూడా డివిడెండ్ ఇవ్వలేదని.. వారంటున్నారు. ఈ మేరకు సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. దీనిపై అప్పట్లో జగతి పబ్లికేషన్స్ చైర్మన్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డిపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పటిషన్లలోనూ అదే చెబుతున్నారు. మోసపోయామని ఫిర్యాదు చేసిన ముగ్గురూ.. తన పేరును ఎక్కడా చెప్పలేదని.. తనకు సంబంధం లేదని.. తనను కేసు నుంచి డిశ్చార్జ్ చేయాలని జగన్ కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదుల వాదన న్యాయవర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తోంది. ఆర్థికపరమైన నేరాల్లో అంతిమంగా లబ్దిదారు ఎవరో చూస్తారు.
అసలు అప్పటికే ప్రారంభం కాని కంపెనీ విలువను.. రూ. 10 కూడా చేయని షేర్ వాల్యూను డెలాయిట్‌తో కలిసి రూ. 350కి పెంచి.. అమ్మించడం వల్ల విజయసాయిరెడ్డికి వచ్చిన లాభం ఏమిటి..?. ఆయనకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కలిగినట్లుగా సీబీఐ ఇంత వరకూ చెప్పలేదు. ఆయన ఏం చేసినా జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం కల్పించడానికే చేశారని సులువుగానే అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తరపు లాయర్లు తనకేమీ తెలియదని… కోర్టులో వాదించడం.. ఆసక్తికర పరిణామంగా మారింది.