ఎంపీ రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు చేస్తున్న పనుల వల్ల పార్టీకి నష్టం కలుగుతోందని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ వివాదంలో ఆయన జైలు వెళ్లిన దగ్గర్నుంచీ జగ్గారెడ్డి ఇలా సీరియస్ అవుతున్న సంగతి తెలిసిందే. రేవంత్ జైలు వెళ్లడం వ్యక్తిగత వ్యవహారమనీ, పార్టీతో దానికి సంబంధం లేదని ఆయనే అన్నారు. అయితే, ఇవాళ్టి టాపిక్ ఏంటంటే… రేవంత్ రెడ్డి అనుచరులు కొందరు సోషల్ మీడియాలో లేనిపోని పోస్టులు పెడుతున్నానీ, తనతోపాటు కొంతమంది నేతలు పార్టీ మారతారనే అసత్య కథనాలు రాస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి పులీ సింహం అంటూ అభివర్ణిస్తున్నారనీ, ఇలాంటి రాతలు వెంటనే బంద్ చెయ్యాలనీ, రేవంత్ తీరుపై మీద పార్టీ కోర్ కమిటీలో చర్చ పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా అన్నారు జగ్గారెడ్డి.
రేవంత్ రెడ్డి ఒక్కడే తీస్మార్ ఖాన్ కాదనీ, నేను విజిలేస్తే పదివేల మంది తనకీ వస్తారనీ, ఉత్తమ్ కుమార్ జానారెడ్డి శ్రీధర్ బాబు.. ఇలా అందరీ వేల మంది అనుచరులున్నారని జగ్గారెడ్డి అన్నారు. పార్టీ నీ ఒక్కనిదా అంటూ రేవంత్ ని ప్రశ్నించారు. ఈయనే హీరో, ఈయనే పీసీసీ, ఈయనే ముఖ్యమంత్రి అన్నట్టు రాతలేంటన్నారు. ఆయన సీఎం ఎలా అవుతారనీ, పైసలు పెట్టాలీ ఉద్యమాలు చెయ్యాలీ ఇన్ని చేస్తేనే అయితారన్నారు. రేవంత్ అంత తీస్మార్ ఖాన్ అయితే, టీడీపీలో ఉండి ఎందుకు చేసుకోలేకపోయారు, పార్టీ ఎందుకు మారారు, సొంత నియోజక వర్గంలో కూడా ఎందుకు ఓడిపోయారు అంటూ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. నాకూ సీఎం కావాలనుంది, పీసీసీ కావాలనుందని అన్నారు. పార్టీలో అందరికీ అన్నీ కావాలని ఉంటుంది, కానీ డిసైడ్ చేసేది సోనియా గాంధీ అని చెప్పారు.
ఇప్పటికైనా రేవంత్ అనుచరులు ఈ ప్రచారాలు బంద్ చెయ్యకపోతే ఢిల్లీకి వెళ్తా, సోనియా గాంధీ రాహుల్ గాంధీలను నేరుగా కలుస్తా అన్నారు. రేవంత్ ని తక్షణమే పార్టీ నుంచి పక్కన పెట్టాలంటూ కోరతా అని జగ్గారెడ్డి చెప్పారు. పార్టీని ఎలా లేపాలో మాకు తెలుసని చెప్తామని, ఆ బాధ్యతలన్నీ తాము తీసుకుంటామని హైకమాండ్ కి చెప్తామన్నారు. మొత్తానికి, జగ్గారెడ్డి పంచాయితీ రోజురోజుకీ పెద్దదౌతోంది. రేవంత్ అనుచరుల పేరుతో ఆయనపై ఉన్న అక్కసును అంతా వెళ్లగక్కేశారు జగ్గారెడ్డి. రేవంత్ ని పార్టీ నుంచి తొలగించాలని అనేస్తున్నారు! ఇది జగ్గారెడ్డి అభిప్రాయం మాత్రమేనా, రేవంత్ పనితీరుపై కొన్నాళ్లుగా అక్కసుగా ఉంటూ ఉన్న ఇతర సీనియర్ నేతలది కూడానా అనేది బయటపడాల్సి ఉంది!