తెలంగాణ కాంగ్రెస్ లో ఈ పంచాయితీ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. నువ్వొకటి అంటే, నేను మరొకటి అంటా అన్నట్టుగా మారింది ఎంపీ రేవంత్ రెడ్డి వెర్సెస్ జగ్గారెడ్డిల వ్యవహారం. మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ మీద డ్రోన్ కెమెరా ఎగరేసిన వివాదంలో రేవంత్ జైలు వెళ్లాక… ఆయన అభిమానులపై జగ్గారెడ్డి ఫైర్ అయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ లో ఆయనొక్కడే తీస్మార్ ఖానా అంటూ వ్యాఖ్యానించారు కదా! అయితే, బెయిల్ మీద విడుదలై వచ్చిన రేవంత్ రెడ్డి… ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద విమర్శలు చేసిన సంగతీ తెలిసిందే. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి మరోసారి స్పందించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని మెచ్చుకున్నారు.
జైల్లో ఖైదీలు మాట్లాడితేనే తనకు ఆలోచన వచ్చిందని రేవంత్ అన్నారనీ, అందుకే ఉత్తమ్ ని ప్రశ్నిస్తున్నా అనడం సరికాదన్నారు. ఖైదీలు ఏది చెబితే అది చేస్తావా, జైల్లో ఉండమంటే ఉంటావా అంటూ ఎద్దేవా చేశారు. ఉత్తమ్ కుమార్ మీద రేవంత్ రెడ్డి అలా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ఎన్నో అవమానాలు భరిస్తూ ఉత్తమ్ పార్టీని నడిపారనీ, కష్టకాలంలో ఆయనే పార్టీకి అండగా ఉన్నారనీ, ఆయన వ్యక్తిత్వం ఉన్న నేత అంటూ జగ్గారెడ్డి ప్రశంసించారు. అధికార పార్టీ అవినీతిపై ఎలా పోరాటం చెయ్యాలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియాని అడుగుతానని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు వేర్వేరు బాధ్యతలు ఉంటాయన్నారు! ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ పాలన మీద కొట్లాడితే, ఎంపీలు ప్రధాని మోడీ మీద పార్లమెంటులో కొట్లాడాలన్నారు. ఎంపీ రేవంత్ రెడ్డికి ఇక్కడి వ్యవహారాలతో పనేముందని ప్రశ్నించారు? కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకుందామనీ, ఎవరు హీరోలు, ఎవరు పులులు అనేది అక్కడ మాట్లాడుకుందామన్నారు. పార్టీ బాధ్యతలు ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే కుంతియా అప్పగించారా… ఆ మాట కుంతియాని అడుగుతా అన్నారు.
నిజానికి, రేవంత్ రెడ్డి మీద తీవ్ర విమర్శలకు ముందుగా దిగిందే జగ్గారెడ్డి. పార్టీకి రేవంత్ చర్యల వల్ల నష్టం అంటూ ఆయనే ఆరోపణలు ప్రారంభించారు. అయితే, జగ్గారెడ్డి వ్యాఖ్యలపై రేవంత్ ఈ స్థాయిలో సమాధానం చెప్పలేదు. తప్పుడు సమాచారం వల్ల, పింక్ మీడియా అసత్య కథనాల వల్ల జగ్గారెడ్డి అలా మాట్లాడి ఉంటారనీ, ఆయన్ని తప్పుబట్టేది లేదని మొన్ననే అన్నారు. కానీ, జగ్గారెడ్డి మాత్రం రేవంత్ విషయంలో ఏమాత్రం తగ్గేలా లేరు. ఈ పంచాయితీని ఢిల్లీ పెద్దలు తీర్చాల్సిందే!