కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బయటకు వెళ్లడం ఖాయమే అయినా ఎంత వీలయితే అంత కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసి వెల్లాలన్న ఆలోచనతో ఉన్నట్లుగా ఉన్నారు. శుక్రవారం కార్యకర్తలతో సమావేశం అయినట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చిన ఆయన ఉదయమే జూబ్లిహిల్స్‌లోని ఓ హోటల్లో ప్రత్యక్షం అయ్యారు. అక్కడ ఓ వ్యక్తి కాంగ్రెస్‌ను వీడొద్దంటూ కాళ్లు పట్టుకున్న దృశ్యాలను మీడియాకు ఇచ్చి ఈ రోజు కథ ప్రారంభించారు. ఆ తర్వాత మీడియా ఇంటర్యూల్లో చెప్పాలనుకున్నది చెప్పారు. సహజంగానే ఆయనకు ప్రాధాన్యం ఇచ్చారు. అన్నీ మీడియాలకు కావాల్సిన విధంగా చెప్పిన తర్వాత సోనియా, రాహుల్ గాంధీలకు లేఖ రాసి దాన్ని కూడా మీడియాకు లీక్ చేశారు.
అందులో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పుకున్నారు. దానికి కారణం రేవంత్ రెడ్డి అని పరోక్షంగా చెప్పారు. సొంత పార్టీలోనే కుట్ర చేసి కోవర్టుగా ముద్రవేశారని.. కాంగ్రెస్‌లో హుందాతనం లేదన్నారు. లాబీయింగ్ ద్వారా కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ అవ్వొచ్చని విమర్శించారు. పార్టీని వీడినా గాంధీ కుటుంబానికి విధేయంగా ఉంటానని చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే జగ్గారెడ్డి పకడ్బందీ ప్లాన్‌తోనే రాజకీయం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడమే ఆ ప్లాన్.
అయితే రేవంత్ రెడ్డి మాత్రం జగ్గారెడ్డి విషయంలో కూల్‌గానే స్పందించారు. కుటుంబంలో అభిప్రాయభేదాలు ఉన్నట్లే పార్టీలోనూ ఉన్నాయని అవన్నీ సర్దుకుంటాయన్నారు. వివాదం టీ కప్పులో తుపాన్ లాంటిదన్నారు. కొసమెరుపేమిటంటే నిన్నటి వరకూ రేవంత్ కు కాస్త మద్దతుగా ఉన్న వీహెచ్ ఇప్పుడు జగ్గారెడ్డితో చేరారు. రేవంత్ పై విమర్శలు చేస్తున్నారు.