తాను మొదలు పెడితే రేవంత్‌పై ఇతరులు తిరుగుబాటుకు వస్తారని ఆశించిన జగ్గారెడ్డికి కోలుకోలేని షాక్ తగిలింది. రేవంత్ కు వ్యతిరేకంగా తాను తప్ప ఎవరూ కోరస్ అందుకోకపోవడంతో ఏం చేయాలో తెలియక ఇప్పుడు తంటాలు పడుతున్నారు. రేవంత్ కు పీసీసీ చీఫ్ పోస్ట్ ఇవ్వడం ఇష్టం లేని వర్గం ఎక్కువే ఉంది. వారంతా సీనియర్ లీడర్లు . కానీ ఎవరూ నోరు మెదపడం లేదు. వారి తరపున జగ్గారెడ్డి చేయాల్సిన రచ్చ చేసేవారు. ఇప్పుడు జగ్గారెడ్డిని అందరూ వదిలేసినట్లుగా కనిపిస్తోంది.
కాంగ్రెస్‌లో రేవంత్వ్యతిరేక వర్గం బలంగానే ఉంది. ఉత్తమ్, కోమటిరెడ్డి సోదరులు, జానారెడ్డి, జీవన్‌రెడ్డి, దామోదర రాజనర్సింహా, మధుయాష్కీ, భట్టి, ఇలా చాలా మంది నేతలు వ్యతిరేకంగానే ఉన్నారు. కొంతమంది గాంధీభవన్‌కు కూడా రావడం లేదు. అయినా వీరెవరూ జగ్గారెడ్డికి మద్దతు తెలియచేయలేదు. రేవంత్ కారణంగా పార్టీలో సీనియర్లు ఉండే పరిస్థితి లేదనే విధంగా సీనియర్లు బయటకు వస్తారని అనుకున్నారు. కానీ ఎవరూ రాలేదు.
జగ్గారెడ్డితో పార్టీ సీనియర్లు మాట్లాడుతున్నారని రేవంత్ చెబుతున్నారు కానీ.. నిజానికి ఎవరూ జగ్గారెడ్డితో సంప్రదించడం లేదు. ఎఐసీసీ నుంచి కూడా ఒక్క ఫోన్ కాల్ కూడా జగ్గారెడ్డికి రాలేదు. ఆయన ఉంటే ఉన్నారు లేకపోతే లేదని లైట్ తీసుకున్నారు. ఏఐసీసీ నేతలు జగ్గారెడ్డిని బుజ్జగిస్తున్నారని రేవంత్‌రెడ్డిని మందలిస్తున్నారంటూ ఒక వర్గం ప్రచారం చేయాలని ప్రయత్నించినా తుస్‌మంది. ఇప్పుడు జగ్గారెడ్డి ఏదో ఒకటి చెప్పుకుని కాంగ్రెస్‌లో కొనసాగడం తప్ప.. మరో మార్గం లేకుండా పోయింది. బయటకు వెళ్తే ఇతర పార్టీలు చేర్చుకుంటాయో లేదో చెప్పడం కష్టం. మొత్తంగా జగ్గారెడ్డిని నమ్ముకున్న వాళ్లే నట్టేట ముంచేసినట్లయింది.