త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. షెడ్యూల్ కూడా ఖరారు అయిపోయింది. ఈసారి సత్తా చాటుకుని, కేసీఆర్ సర్కారు మీద పైచేయి సాధిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు షురూ చేశారు. దీంతోపాటు, గతంలో మాదిరిగానే మరోసారి ఎన్నికల సంఘం పనితీరు మీద ఇప్పట్నుంచే అనుమానాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఇదే అంశమై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… తెరాస అధికారంలోకి వచ్చాక ఎన్నికల సంఘంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ఓటర్ల పక్షాన కాకుండా, తెరాస పక్షాన ఈసీ పనిచేస్తోందని ఆరోపించారు.
ఎన్నికల షెడ్యూల్ ని ఈసీ ప్రకటించక ముందే తెరాస కార్యకర్తల ఫేస్ బుక్ అకౌంట్లలో తేదీలు ఎలా ముందుగా వచ్చాయో చెప్పాలంటూ ఎన్నికల అధికారిని జగ్గారెడ్డి ప్రశ్నించారు. నాగిరెడ్డి ఎన్నికల అధికారిగా ఉన్నారా, తెరాస కార్యకర్తగా ఉన్నారా అంటూ విమర్శించారు. ఓటర్ల జాబితా ప్రకటించకుండా షెడ్యూల్ ఎలా ఇచ్చారంటూ నిలదీశారు. తెరాస అభ్యర్థులను ఖరారు చేసుకుని, కావాల్సిన సొమ్మును పంపించేసి, పోలీసులను అప్రమత్తం చేసుకున్న తరువాతే షెడ్యూల్ ప్రకటించారని ఆరోపించారు. సరిగ్గా సంక్రాంతి పండుగ సమయంలోనే ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందనీ, కాస్త అటు ఇటుగా షెడ్యూల్ పెట్టుకుంటే తప్పేముందన్నారు. పండుగ సమయంలో అయితే ప్రజలు ఫోకస్ ఎన్నికల మీద పెద్దగా ఉండదు కాబట్టి, వ్యతిరేకత నుంచి తప్పించుకోవడం కోసమే ఇలాంటి షెడ్యూల్ పెట్టారంటూ ఆరోపించారు. దీని మీద ముఖ్యమంత్రికి చెప్పినా ఉపయోగం లేదనీ, అందుకే నాగిరెడ్డి మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. తెరాసను రెండు శాఖలు కాపాడుతున్నాయనీ, ఎన్నికలొస్తే ఎన్నికల సంఘం, పోలింగ్ సమయంలో పోలీసులు కాపాడుతున్నారంటూ ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇలానే… తమ మద్దతుదారుల ఓట్లను జాబితా నుంచి ఉద్దేశపూర్వకంగా తొలగించారంటూ ఆరోపించారు. జాబితా సిద్ధం చేయకుండా షెడ్యూల్ చేయడమేంటంటూ ఏకంగా కోర్టుకు కూడా కాంగ్రెస్ నేతలు వెళ్లారు. కానీ, దాని వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేకుండాపోయింది. అలాగని, ఆ అంశాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లడంలోనూ కాంగ్రెస్ విఫలమైంది. మళ్లీ ఇప్పుడు కూడా అచ్చంగా అదే తరహాలో… ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల అధికారిపై ఆరోపణలు ప్రారంభించారు జగ్గారెడ్డి. ఇప్పుడు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదనీ, పోరాటమని అంటున్నారు. ఇదెంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.