కాంగ్రెస్ పార్టీ నేత జగ్గరెడ్డికి బెయిల్ లభించింది. 14 ఏళ్ల కిందటి మనుషుల అక్రమ రవాణా కేసులో ఈ నెల పదకొండో తేదీన పోలీసులు అర్థరాత్రి పూట.. జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారు. 2004లో నేరం జరిగిందని… కొత్తగ ఫిర్యాదు, ఆధారాల లభించాయని చెబుతూ.. పోలీసులు అరెస్ట్ చేసారు. తన భార్య పిల్లల పేరిట ఇతరులను అమెరికాకు జగ్గారెడ్డి తరలించారని పోలీసులు నేరారోపణ చేశారు. ఈ సంఘటన 2004లో జరిగినప్పటికి తాజాగా తమకు అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేశామని, మానవ అక్రమ రవాణా ద్వారా జగ్గారెడ్డికి పెద్దమొత్తంలో డబ్బు ముట్టిందని నార్త్ జోన్ డీసీపీ సుమతి తెలిపారు. మరిన్ని వివరాల కోసం.. మూడు రోజుల కస్టడీకి కూడా తీసుకున్నారు.
కస్టడీ సమయం అయిన తర్వాత జగ్గారెడ్డి తరఫు న్యాయవాదులు ఇదీ రాజకీయకక్షపూరిత కేసు అని .. బెయిల్ మంజూరు చేయాలని సికింద్రబాద్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సోమవారం జగ్గారెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. కేవలం రాజకీయ కక్షతోనే… ఈ కేసులో జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారని కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తోంది. ఆనాటి మనుషుల అక్రమ రవాణా కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తి.. కేసీఆర్, హరీష్ రావుల పేర్లు కూడా చెప్పారని .. ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదికను బయటపెట్టారు. హరీష్ రావు పేరుతో కొంత మంది ఇప్పటికీ అమెరికాలో ఉన్నారని చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా జగ్గారెడ్డిపై ఎలాంటి ఆధారాలు దొరికాయో.. పోలీసులు బయటపెట్టలేదు.
ఎవరు ఫిర్యాదు చేశారో కూడా చెప్పలేదు. పాస్పోర్ట్ ఆఫీసు నుంచి ఫిర్యాదు వచ్చిందో లేదో కూడా పోలీసులు చెప్పలేదు. మొత్తానికి జగ్గారెడ్డిని ఆకస్మికంగా అరెస్ట్ చేయడం.. చేసిన కేసు పధ్నాలుగేళ్ల కిందటిది కావడంతో.. రాజకీయంగా కక్ష సాధింపేనన్న చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచన చేస్తోంది. జైలు నుంచి విడుదలైన తర్వాత జగ్గారెడ్డి ఈ దిశగా కేసీఆర్ కు వ్యతిరేకంగా కార్యాచరణ సిద్ధం చేసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.