రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారని తేలిన తరవాత జగ్గారెడ్డి తన మార్క్ చూపించాలని తహతహలాడారు. ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులతో సభ పెట్టించాలని నిర్ణయించారు. వద్దంటే ఆయన చేసే రచ్చ ఎక్కువ ఉంటుందని అనుకున్నారేమో కానీ.. ముందు అనుమతుల సంగతి చూసుకోమన్నారు. అప్పట్నుంచి జగ్గారెడ్డి రాహుల్ గాంధీతో ఉస్మానియాలో మీటింగ్ కోసం చేయని ప్రయత్నం లేదు. ఓయూ పాలక మండలిని కలిశారు. కాంగ్రెస్ సానుభూతిపరులైన విద్యార్థులు..ఎన్ఎస్యూఐ నేతలతో కలిసి ఉద్యమం చేశారు.
అది రాజకీయాలకు అతీతమైన సభ అని చెప్పాల్సినదంతా చెప్పారు. కానీ చివరికి ఆలోచించి… సభకు అనుమతి లేదని ఓయూ పాలక మండలి చెప్పింది.ఈ అంశంపై జగ్గారెడ్డి ఆందోళనకుప్రయత్నించి అరెస్టయ్యారు. ఆయన అలా అరెస్టయిన తర్వాత ఇలా రాహుల్ షెడ్యూల్ రిలీజ్ అయింది. అందులో ఉస్మానియా ప్రోగ్రాం లేదు. ఆరో తేదీన వరంగల్ రైతు సంఘర్షణ సభ తర్వాత హైదరాబాద్ హోటల్లో బస చేసి ఉదయం గాంధీ భవన్లో మీటింగ్ నిర్వహించి అటునుంచి అటు ఢిల్లీ వెళ్లిపోతారు.
అనుమతులు లేకపోయినా సభ నిర్వహించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేయాలనుకున్నా.. రాహుల్ టూర్‌ను రచ్చ చేయడం ఎందుకని ఆగిపోయినట్లుగా ఉన్నారు. మొత్తంగా జగ్గారెడ్డి .. రాహుల్ ముందు ఉస్మానియాలో సభ నిర్వహించి బలాన్ని ప్రదర్శించాలనుకున్నా చివరికి ఎటూకాకుండా పోయింది. ఈ మొత్తం ఎపిసోడ్లో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాహుల్ దాకా ఎందుకు ఉస్మానియాకు కేసీఆర్ రావాలని చాలెంజ్ చేశారు.