ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ధర్నా చేస్తానంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సహజంగా ప్రతిపక్ష నేతలు… ఫలానా పని చేయాలనో.. లేకపోతే… ప్రజా సమస్యలు పరిష్కరించాలనో ధర్నా చేస్తారు. కానీ జగ్గారెడ్డి మాత్రం దానికి భిన్నం. తాను కలిసేందుకు కేసీఆర్ సమయం ఇవ్వాల్సిందేంటున్నారు. లేకపోతే.. కలిసే వరకూ ప్రగతిభవన్ ముందు ధర్నా చేస్తానంటున్నారు. అయితే.. జగ్గారెడ్డి తనదైన శైలిలో ట్విస్ట్ ఇచ్చారు. అదేమిటంటే.. ప్రజాసమస్యలను వివరించేందుకే… తాను కేసీఆర్ కలవాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. తమ సమస్యలు కేసీఆర్ విని పరిష్కారం చూపించాలంటున్నారు. ఆ సమస్యలు ప్రజా సమస్యలా.. జగ్గారెడ్డి సమస్యలా అన్నది ప్రస్తుతానికి అప్రస్తుతం.
జగ్గారెడ్డి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ… ఆయన తన పోరాటాన్ని ఎక్కువగా హరీష్ రావుపైనే కేంద్రీకరించారు. తనను జైలు పంపడం దగ్గర్నుంచి … సంగారెడ్డికి నీటి కొరత వరకూ ఆయన అన్నింటికీ హరీష్ రావునే కారణంగా చూపిస్తూంటారు. ఇదంతా.. కేసీఆర్‌ను మెప్పించడానికేనని.. కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటూ ఉంటాయి. అయినప్పటికీ.. ఆయనకు ఇంత వరకూ కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తాను కేసీఆర్ ను కలుస్తానని.. గెలిచినప్పటి నుండి చెబుతున్నారు. అప్పటి నుండి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ రెండేళ్లు దాటిపోయినా ప్రయోజనం లేకపోయింది. అందుకే.. ఆయన ఈ సారి ధర్నా మార్గాన్ని ఎంచుకున్నారని అంటున్నారు.
సాధారణంగా కేసీఆర్ ఇప్పుడు ఎవరికీ అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదు. అన్నీ కేటీఆరే చూసుకుంటున్నారు. అధికారిక సమావేశాలు మాత్రమే… కేసీఆర్ నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో… ఏమైనా చెప్పుకోవాలంటే.. జగ్గారెడ్డి.. కేటీఆర్‌తో చెప్పుకోవచ్చు. కానీ అలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. కేసీఆర్ అపాయింట్మెంటే కావాలంటున్నారు. ఇదే.. కాంగ్రెస్‌లో చర్చకు కారణం అవుతోంది.