సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి హరీష్ రావును టార్గెట్ చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పొగుడుతూ.. హరీష్ ను మాత్రం టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అయితే..కొన్నాళ్ల కిందట.. రూటు మార్చారు. హరీష్‌తోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్లుగా ప్రకటనలు చేశారు. ఓ కార్యక్రమంలో సన్మానం కూడా చేశారు. ఆ మధ్య ఆయన ఇంటికి వెళ్లి కలిసినట్లుగా ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. దాంతో హరీష్‌తో ఉన్న గొడవలన్నీ ఆయన సాఫ్ చేసుకుని…నొప్పింపక..తానొవ్వక రాజకీయం చేస్తున్నారని అనుకున్నారు ఇంతలో ఏమయిందో కానీ.. మళ్లీ ఆయన హరీష్ రావును టార్గెట్ చేశారు.
హరీష్‌రావు మంత్రి కాదు..నీటి దొంగ అని గాంధీ భవన్లో ప్రెస్‌మీట్ పెట్టి మరీ మండిపడ్డారు. హరీష్‌రావు తీరుపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని హెచ్చరించారు. గతంలో హరీష్‌రావుకు ఎందుకు సన్మానం చేశానో తర్వాత ఎపిసోడ్లో చెబుతానని ప్రకటించారు. ఆ సన్మానసభలో కేసీఆర్ గురించి హరీష్‌రావు ఏమన్నాడో త్వరలో బయటపెడతానని బెదిరించేలా మాట్లాడారు. మంజీరా నీటిని అక్రమంగా తరలించి సంగారెడ్డి ప్రజల గొంతుకోశారని పాత ఆరోపణలను కొత్తగా చేయడం ప్రారంభించారు. జగ్గారెడ్డి ఎప్పుడు ఎలా మాట్లాడతారో..ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉంది.
గతంలో కాంగ్రెస్ పైనే అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. హరీష్‌తో కలిసినట్లుగా కనిపించారు. మళ్లీ ఇప్పుడు కేసీఆర్ ను పొగుడుతూ…హరీష్‌ను టార్గెట్ చేయడం ప్రారంభించారు. తెర వెనుక ఏదో రాజకీయం లేకపోతే.. జగ్గారెడ్డి ఇలా మాట్లాడరని ఆయన వర్గీయులు చెబుతూ ఉంటారు. కాంగ్రెస్‌లో ఉన్న రాజకీయం సమస్యే అది మరి..!