సంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిల కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని కేటీఆర్ కోవర్ట్ అని విమర్శించడంతో .. జగ్గారెడ్డికి ఎక్కడో కాలింది. ఆయన చాలా కాలంగా బహిరంగ రాజకీయ ప్రకటనలకు దూరంగా ఉన్నారు. కానీ షర్మిల అన్న మాటలకు మాత్రం ఆయన మీడియా ముందుకు వచ్చారు. షర్మిల, జగన్. వైఎస్ కుటుంబ తీరును ఆయన మొదటి రోజే నిశితంగా విమర్శించారు. ఆయన మాటలు తెలంగాణలో కన్నా ఏపీలో వైరల్ అయ్యాయి. తెలంగాణలో షర్మిల రాజకీయ ఫోర్స్ గా మీడియా భావించడం లేదు.
అయితే సోషల్ మీడియాలో మాత్రం జగ్గారెడ్డి మాటలు వైరల్ అవడంతో.. షర్మిల మరోసారి విమర్శలు చేశారు. అయితే జగ్గారెడ్డి ఏ మాత్రం తగ్గలేదు. ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తన జోలికి వస్తే షర్మిల గురించి ఇన్ డెప్త్ విషయాలు చెబుతానని హెచ్చరించారు. తన జోలికి రావొద్దు.. తనతో మాటలు పడొద్దని ఆయన సలహాలిస్తున్నారు. అదే సమయంలో ఆయన ఏపీ గురించి హాట్ కామెంట్స్ చేస్తున్నారు. సీఎం పదవి కోసం షర్మిల ఇలా చేస్తున్నారని.. ఏమైనా ఉంటే.. ఏపీలో చూసుకోవాలన్నారు.
ఏపీని మూడు ముక్కలు చేసుకుని జగన్, షర్మిల, విజయసాయిరెడ్డి పంచుకోవచ్చని సలహా ఇచ్చారు. అంతే కానీ తెలంగాణలో రచ్చ చేయవద్దని సూచించారు. షర్మిల టీఆర్ఎస్ నేతల్ని ఇప్పటి వరకూ చాలా సార్లు దూషించారు కానీ.. వారు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. రివర్స్ ఎటాక్ చేయలేదు. కానీ జగ్గారెడ్డి స్టైలే వేరు. అందుకే ఆయన షర్మిలను అలా వదిలి పెట్టడం లేదు. మాటలకు మాట కౌంటర్ ఇస్తున్నారు.