రాజకీయాల్లో పెద్దగా పనేమీ లేకపోవడంతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సినిమాలపై దృష్టి పెట్టారు. ముందుగా తన జీవిత చరిత్రను తెరకెక్కించుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆఫీసును ప్రారంభించారు. ఇక నుంచి ఈ ఆఫీసే తన అడ్డా అని జగ్గారెడ్డి ప్రకటించారు. తన జీవితం చాలా కింది స్థాయి నుంచి ప్రారంభమయిందని దానికి తగ్గట్లుగానే అన్ని విషయాలు ఉంటాయన్నారు.
ఇప్పుడు మొత్తం ఈ సినిమాపైనే దృష్టి పెట్టానని .. తన జీవిత చరిత్రలో ఇతరులు కూడా ఉన్నా.. ఓ కీలక పాత్రను తాను పోషిస్తానని జగ్గారెడ్డి చెబుతున్నారు. జగ్గారెడ్డి సీనియర్ రాజకీయ నేత అయిన తర్వాత వచ్చే సీన్లలో ఆయన రోల్ లో ఆయనే నటిస్తారని.. యువకుడిగా ఉన్నప్పుడు ఇతర నటులు నటిస్తారు.
ఇంతకు ముందు జగ్గారెడ్డి ఓ లవ్ స్టోరీని ప్రకటించారు. అందులో తాను నిజ జీవిత పాత్రను పోషిస్తారని చెప్పారు. అయితే లవ్ స్టోరీ కన్నా ముందుగా తన బయోపిక్ ను తీసుకునేందుకు ఆయన ఆసక్తి చూపించారు. సినిమా కథలు వినిపించి రంగుల లోకంలోకి తీసుకెళ్లే సినీ ఇండస్ట్రీ వాళ్లకు కొదవ ఉండదు కాబట్టి.. అలాంటి వారి జగ్గారెడ్డిని బాగానే మోటివేట్ చేశారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ప్రస్తుతం ఆయన మాట కాంగ్రెస్ లో వినేవారు ఎవరూ లేకపోవడంతో యాక్టివ్ రాజకీయాల విషయంలో అవసరమైతేనే స్పందించాలని అనుకుంటున్నారు.